Weight Loss Injections : బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు వాడొచ్చా? సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ మంచివేనా? నిపుణుల సలహాలు ఇవే
Diabetes Weight Loss Drugs : భారతదేశంలో బరువు తగ్గించే ఇంజెక్షన్లు ట్రెండింగ్ ఉన్నాయి. ఇవి సురక్షితమేనా? నిపుణుల మార్గదర్శకత్వం ఎందుకు అవసరమో తెలుసుకోండి.

Weight Loss Tips : భారతదేశంలో బరువు పెరిగిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువైపోతుంది. బరువు తగ్గించుకోవాలనే కోరిక, ఆరోగ్యంపై అవగాహనతో చాలామంది బరువు తగ్గాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. వ్యాయామాలపై మొగ్గు చూపుతున్నారు. డైట్ ఫాలో అవ్వలేనివారు, వ్యాయామాలు చేయలేని వారు ఇప్పుడు బరువు తగ్గేందుకు సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి ఇంజెక్షన్లను ఆశ్రయిస్తున్నారు. అసలు ఈ మందులు ఏంటి? ఇవి మంచి ఫలితాలు ఇస్తాయా? నిపుణులు ఇస్తోన్న సలహాలు, సూచనలు ఏంటి?
సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి మందులు టైప్ 2 మధుమేహాన్ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగించే మందులు. అయితే ఇవి బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతాయనే కారణంతో బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఇవి అధిక బరువునకు స్థిరమైన పరిష్కారంగా మారనున్నాయా? మందులు ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం.
బరువు తగ్గిస్తుందా?
సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ రెండూ GLP-1 లేదా GIP కలయికలా పనిచేసే మందులు. ఇవి హార్మోన్ల ఆకలి, రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అలాగే జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. కడుపు నిండిన సంతృప్తిని అందిస్తాయి. దీనివల్ల ఆహార తీసుకోవడం సహజంగా తగ్గుతుంది. దీనివల్ల వినియోగదారులు తమ శరీర బరువులో 15–20% వరకు కోల్పోతారు. PCOS, అధిక రక్తపోటు లేదా స్లీప్ అప్నియా వంటి ఊబకాయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి.. ఇది ఓ వరంగా చెప్తున్నారు.
షార్ట్‌కట్ కాదు..
బరువు తగ్గించడంలో ఇవి ఎంత ప్రజాదరణ పొందినప్పటికీ.. ఈ ఇంజెక్షన్లు అందరికీ సరిపోయే పరిష్కారం కాదని తెలిపారు వెయిట్ లాస్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ అంజు గెహీ. ఇవి బరువు తగ్గించే సౌందర్య సాధనాలు కావని తెలిపారు. వైద్యపరంగా సూచించే మందులను ఇలా బరువు తగ్గాలనుకునేవారు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు.
సైడ్ ఎఫెక్ట్స్..
ఈ మందుల వల్ల బరువు తగ్గుతారు. కానీ మందులు ఆపేస్తే మళ్లీ బరువు పెరిగిపోతారు. జీవనశైలిలో మార్పులు లేకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా వికారం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, కండర ద్రవ్యరాశి కోల్పోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు అంజు. దీనితో పాటు మందులు ఉపయోగించి బరువు వేగంగా తగ్గడం వల్ల చర్మం వదులుగా మారిపోతుందని.. హార్మోన్ల హెచ్చుతగ్గులు, పోషకాల లోపం ఏర్పడుతుందని తెలిపారు. వీటితో పాటు మానసిక ఇబ్బందులు కూడా పెరుగుతాయన్నారు.
బరువు వేగంగా తగ్గడం మీకు మంచిగా అనిపించవచ్చు కానీ.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు. బరువు తగ్గడమనేది ఎప్పుడు క్లినికల్‌గా రోగనిర్ధారణ, పోషకాహార మద్ధతు, వ్యాయామం, మానసిక ఆరోగ్యం వంటి వాటితో జరిగినప్పుడే మంచి ఫలితాలు ఇస్తుందని అంజు వెల్లడించారు.
మధుమేహం ఉండేవారు ఉపయోగించవచ్చా?
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు GLP-1 మందులు వైద్యుల సహాయంతో తీసుకోవచ్చు. ఇవి వారికి హెల్ప్ చేయవచ్చు. అయితే ఈ మందులు తీసుకునేవారు తమ లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పోషకాహారం కచ్చితంగా తీసుకోవాలి. అలాగే కండర బలాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయాలి. చర్మం బిగుసుకుపోవడానికి, జీవక్రియను తిరిగి పొందడానికి చికిత్సలు తీసుకుంటే మంచిది. యోగా, ధాన్యం వంటివి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ కలిసినప్పుడే ఈ మందులు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి.






















