Cancer: తరచుగా చెవులు మూసుకుపోతున్నాయా? ఈ అరుదైన క్యాన్సర్ లక్షణం కావచ్చు
క్యాన్సర్ ఒక మహమ్మారి. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే చివరి దశకు చేరుకోకముందే ప్రాణాలు రక్షించుకోవచ్చు.
చెవులు మూసుకుపోయి గుయ్యిమని శబ్దం తరచూ వస్తూ ఉంటుందా? ఇది జలుబు వల్ల లేదంటే చెవిలోకి నీరు పోవడం వల్ల అలా అవుతుందని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది కూడా ఒక రకమైన క్యాన్సర్ అనే విషయం గురించి తెలుసుకునేటప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. శరీరంలోని సాధారణ కణాలలోకి క్యాన్సర్ కణాలు చొరబడి నాశనం చేస్తాయి. ఇది శరీరంలోని ఏదైనా భాగానికి వ్యాప్తి చెందుతుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే అది ఇతర భాగాలకు వ్యాపించి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. అందువల్ల కొన్ని లక్షణాలని గ్రహించుకుని ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. గుండె జబ్బుల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మరణాలకు కారణమయ్యే వ్యాధి క్యాన్సర్.
క్యాన్సర్ అభివృద్ధి చెందే భాగాన్ని బట్టి వివిధ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. చర్మ క్యాన్సర్ అయితే శరీరం మీద మచ్చలు, పుండ్లు ఏర్పడటం, రొమ్ము క్యాన్సర్ అయితే రొమ్ములో గడ్డలు ఏర్పడటం వంటివి కనిపిస్తాయి. ఇక తరచుగా చెవులు దిమ్ములు పడినట్టు అనిపిస్తే అది ముక్కు లేదా సైనస్ క్యాన్సర్ గా గుర్తించాలి. చెవులు మూసుకుపోవడం సాధారణ సమస్యగా అనుకుంటారు. కానీ ఇది ముక్కు, సైనస్ క్యాన్సర్ లక్షణం కనుక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎన్ హెచ్ ఎస్ ప్రకారం నాసికా కుహరం(ముక్కు వెనుక భాగంలో) ఈ క్యాన్సర్ అభివృద్ది చెందుతుంది. ముక్కు, చెంప ఎముకలు, నుదురు లోపల గాలితో నిండిన చిన్న కావిటీస్ లో ఏర్పడే అసాధారణ కణాలను ముక్కు లేదా సైనస్ క్యాన్సర్ అంటారు. ఇటువంటి క్యాన్సర్ చాలా అరుదైనది. కొన్ని నివేదికల ప్రకారం యూకేలో ప్రతి సంవత్సరం సుమారు 260 మంది ఈ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దీని నుంచి బయట పడాలంటే అసలు ముందుగా ముక్కు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి.
లక్షణాలు..
⦿ ముక్కు బిగుసుకున్నట్టుగా అనిపించడం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ముక్కు బిగుసుకున్నట్టుగానే అనిపిస్తుంది.
⦿ కళ్ళు పైన కింద నొప్పి
⦿ ముక్కులో ఏదో అడ్డం పడినట్టుగా భావన
⦿ పోస్ట్ నాసల్ డ్రిప్
⦿ ముక్కు నుంచి చీము కారడం
⦿ ముక్కు నుంచి రక్తం రావడం
⦿ ముఖం భాగాలలో తిమ్మిరి లేదా నొప్పి
⦿ దంతాలు వదులుగా మారడం, తిమ్మిరిగా అనిపించడం
⦿ ముఖం, అంగిలి లేదా ముక్కు లోపల ఒక ముద్ద ఏర్పడటం
⦿ కళ్ళు నుంచి నిరంతరం నీరు కారడం
⦿ కన్ను ఉబ్బడం
⦿ దృష్టిలో మార్పు, మసక బారడం
⦿ చెవుల్లో నొప్పి
⦿ వినికిడి లోపం
⦿ తలనొప్పి
⦿ నోరు తెరవడంలో ఇబ్బంది
⦿ మెడలో శోషరస గ్రంథులు విస్తరించడం.. అంటే చర్మం కింద గడ్డులు ఏర్పడటం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ కూరగాయల విత్తనాలు రోస్ట్ చేసుకుని తిన్నారంటే టేస్ట్ అదుర్స్