HIV: ప్రపంచంలో తొలిసారి ఎయిడ్స్ రోగి గుండెను మరో ఎయిడ్స్ రోగికి ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వైద్యులు
ప్రపంచంలోనే తొలిసారి జరిగిన అవయవ మార్పిడి ఇది.
గుండె మార్పిడి చికిత్సలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం ప్రపంచంలోనే తొలిసారి. అమెరికాలో ఓ ఎయిడ్స్ రోగికి గుండె మార్పిడి చేశారు. అది కూడా మరో ఎయిడ్స్ రోగి గుండెనే ఎంపిక చేశారు. ఆ గుండె మార్పిడి విజయవంతం అయ్యింది. ఆ రోగి వివరాలు వైద్యులు గోప్యంగా ఉంచారు. ఆమెకు అరవై ఏళ్లు ఉంటాయని, చాలా ఏళ్లుగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పారు. ఆమెకు గుండె సమస్య వచ్చింది. మార్పిడి చేయాల్సిన అవసరం రావడంతో దాత కోసం వెతికారు. అదే సమయానికి వేరే ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి వివరాలు పంపించారు. అయితే ఆ వ్యక్తికి కూడా ఎయిడ్స్ ఉన్నట్టు గుర్తించారు. అయితే గుండె ఆరోగ్యంగానే ఉన్నట్టు గుర్తించారు. వెంటనే దాన్ని మహిళా రోగికి అమర్చారు.
ఆ ఆపరేషన్ కోసం దాదాపు నాలుగ్గంటల పాటూ కష్టపడ్డారు. ఈ అవయవ దానం చరిత్రలో ఒక మైలురాయి అని వర్ణించారు వైద్యులు. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వ్యక్తులు కూడా వ్యాధిని బాగా నియంత్రించి అవయవ దానానికి అర్హత సాధిస్తున్నారని అన్నారు. గుండె మార్పిడి చేశాక మహిళా రోగి అయిదు వారాల తరువాత బాగా కోలుకుంది. ఆమె బాగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసే ఆలోచనలో ఉన్నారు వైద్యులు. 2013లో అమెరికా హెచ్ఐవీ ఆర్గాన్ పాలసీ ఈక్విటీ చట్టం ఎయిడ్స్ రోగులు కూడా మరో ఎయిడ్స్ రోగికి అవయవదానం చేయచ్చొని తేల్చి చెప్పింది. అయితే ఇంతవరకు అలాంటి కేసు ఒకటి కూడా వైద్యుల వద్దకు రాలేదు. దాదాపు పదేళ్ల తరువాత ఇప్పుడు ఆ చట్టం చేసినందుకు ఫలితం కనిపించింది.
మీకు తెలుసా?
చనిపోతూ కూడా మరో మనిషికి ప్రాణం పోయగల శక్తి అవయవ దానానికే ఉంది. మీకు తెలుసా? మన శరీరంలో దాదాపు 200 అవయవాలు, కణజాలాన్ని దానం చేయచ్చు. పెద్ద పేగులు, చిన్న పేగులు, కళ్లు, ఎముక మూలుగు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇలా చాలా అవయవాలు దానం చేయచ్చు. కాకపోతే చనిపోయాక అవయవాల మార్పిడి కొన్ని గంటల్లోనే జరిగిపోవాలి. లేకపోతే ఆ అవయవాలు పనికిరాకుండా పోతాయి. బ్రెయిన్ డెడ్ ప్రకటించిన వ్యక్తి శరీరంలోని గుండెను తీస్తే కేవలం నాలుగైదు గంటల్లో దాన్ని మరో వ్యక్తికి అమర్చేయాలి. అదే మూత్రపిండాలైతే 24 గంటల్లో మార్చాలి.
Also read: ఇలాంటి కలలు వస్తున్నాయంటే అర్థం మీకు అలాంటి మానసిక సమస్య ఉన్నట్టే
Also read: ప్రాణాన్ని నిలబెట్టే ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, వీటితో మరిన్ని ఉపయోగాలు