మొబైల్‌లో ఫుడ్ ఫొటోలు చూస్తే ఆకలి తీరిపోతుందా? తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి
కొన్ని చిత్రమైన విషయాలు మన లాజిక్ కు అందవు. కానీ అవి నిజాలుగా నిరూపితమవుతాయి. అలాంటి ఒక అధ్యయనం గురించి ఇవ్వాళ తెలుసుకుందాం.
జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అహనా పెళ్లంట’ మూవీలో కోట శ్రీనివాస రావు కోడిని ఎదురుగా వేలాడ దీసుకుని.. దాన్ని చూస్తూ ఉత్తి అన్నం తింటూ చికెన్ తిన్నంత తృప్తిగా ఉందని ఫీలవుతారు. ఆ సీన్ తలచుకుంటే ఇప్పటికీ నవ్వు ఆగదు. అయితే, తాజా స్టడీలో అది నిజమేనని తేలింది. మీకు ఆకలిగా ఉన్నపుడు ఫోన్లో ఆహార పదార్థాల బొమ్మలు చూస్తే చాలు.. మీ ఆకలి తీరిన భావన కలుగుతుందట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.
ఒక తాజా అధ్యయనం ఈ విషయాన్ని రుజువు చేసింది. ఎలా అంటే మనం బాధలో ఉన్నప్పుడు సంగీతం వినడం, లేదా ఏదైనా ఎమోషల్ వీడియో చూడడం ద్వారా ఎలా కొంత వరకు ఉపశమనం పొందుతామో.. ఆకలి వేసినప్పుడు ఆహారం ఫొటోలు, వీడియోలు చూడటం ద్వారా కాస్త ఉపశమనం పొందవచ్చట. పిల్లలు వీడియోలు చూసి ఆనందించినట్టే.. ఆహార పదార్థాల బొమ్మలు చూసి ఆకలి తీరినట్టు తృప్తిపడొచ్చు అంటున్నారు అధ్యయన కారులు.
అవసరానికి తగినట్టుగా మారే మన సైకలాజికల్ అస్పెక్ట్స్ ఇందుకు కారణం అవుతాయట. మనకు ఆకలిగా ఉన్నపుడు ఎవరో వేడిగా ఆహారం తయారు చెయ్యడం కానీ.. రుచిగా ఉండే పదార్థం తినడం గాని విడియోలో చూపినపుడు మన ఆకలి కొంత ఉపశమించిన భావన కలుగుతుందనేది వీరి వాదన. 30 నిమిషాల పాటు ఆహారానికి సంబంధించిన విడియోలను మొబైల్ ఫోన్ లో చూడడం ద్వారా ఆకలి బాధ నుంచి ఉపశమనం దొరుకుతుందని నిరూపించే ప్రయోగాలు వారు నిర్వహించారు.
అయితే ప్రీ రివ్యూడ్ జర్నల్ అపెటైట్ లో ప్రచురించిన ఒక పరిశోధన ఇందుకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఒకే చిత్రాన్ని పదేపదే 30 నిమిషాల పాటు చూస్తే వెంటనే ఆ పదార్థం తినాలనే భావన కలిగి ఆకలి మరింత పెరుగుతుందని ఈ పరిశోధన వివరిస్తోంది. ఆహార పదార్థాల చిత్రాలు చూడడం వల్ల మరింత ఆకలిగానూ అనిపించవచ్చు. లేదా ఆకలి తీరిన భావన కూడా కలుగవచ్చు. ఈ స్టడీ కోసం కొంత మందిని ఒక గదిలో అరగంట సమయం పాటు ఉంచి.. వారికి రకరకాల ఆహార పదార్థాల చిత్రాలను చూపిస్తుండడం వల్ల ఆకలి తీరి తృప్తి కలిగిందని ఈ అధ్యయన నిపుణులు అంటున్నారు.
మనం ఆహారం తీసుకోవడం లేదా ఆహారం పట్ల ఉండే అభిరుచి మన కాగ్నిటివ్ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం గురించి మనమెలాంటి భావనతో ఉంటామనేది చాలా ముఖ్యమైనదనేది నిపుణుల అభిప్రాయం. ఉదాహారణకు పచ్చి మామిడి ముక్క కట్ చేసి దానిమీద ఉప్పూకారం చల్లుకుని తినడం గురించి ఆలోచించినపుడు కూడా అది నిజంగా తిన్నపుడు మెదడులో ఎలాంటి చర్యలు జరుగుతాయో అవే చర్యలు జరగడాన్ని గుర్తించారట. దీన్ని బట్టి ఆహారం తీసుకున్నప్పటి కంటే కూడా దానికి సంబంధించిన ఆలోచన అనేది తృప్తి కలగడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేది నిరూపితమైంది. మన మానసిక స్థితి మీద మనం ఆహారం విషయంలో స్పందించే విధానం ఆధారపడి ఉంటుంది. ఇది శారీరక అవసరం కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందట. ఇక నుంచి ఏ అర్థరాత్రో ఆకలి వల్ల మెలకువ వస్తే సెల్ ఫోన్ లో ఫూడ్ కి సంబంధించిన వీడియోలు చూడడమో లేదా ఆహారానికి సంబంధించిన ఫోటోలు చూడడమో చేస్తే ఆ బాధ నుంచి తినకుండానే బయటపడొచ్చన్న మాట.
Also read: ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తున్నారా? నిపుణుల సూచనలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.