Seafood: సీ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే?
తరచుగా సీ ఫుడ్స్ తినడం వల్ల పలు రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. సీ పుడ్స్ లోని పాలీ-ఫ్లోరో అల్కైల్ పదార్ధాలు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయంటున్నారు.
Seafood Side Effects: ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. చికెన్, మటన్, ఫిష్ ఏదో ఒకటి వండాల్సిందే. మరికొంత మందికైతే సండే, మండే అనే ఆలోచన ఏమీ ఉండదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాంసం ఘుమ ఘుమలాడాల్సిందే. అయితే, చికెన్, మటన్ తో పోల్చితే సీ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎందో మంచిది అంటారు. అందుకే, చాలా మంది చేపలు, రొయ్యలు, పీతలు లాంటి వాటిని ఎక్కువగా తింటారు. అయితే, తాజాగా అధ్యయనం పలు సంచలన విషయాలను వెల్లడించింది. తరచుగా సీ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని తేల్చింది. సీ ఫుడ్స్ లోని కొన్ని రసాయనాల కారణంగా క్యాన్సర్, అధిక కొలెస్ట్రాల్, థైరాయిడ్, కాలేయ సమస్యలు, గర్భిణీలలో సమస్యలు, పునరుత్పత్తి రుగ్మతల ముప్పు పెరుగుతున్నట్లు గుర్తించారు.
యుకె పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి
యుకెలోని డార్ట్ మౌత్ కాలేజీ పరిశోధకులు తాజాగా సీ ఫుడ్స్ మీద పరిశోధనలు నిర్వహించారు. సీ ఫుడ్ తినడం వల్ల వాటి శరీరంలో పేరుకుపోయిన పారిశ్రామిక రసాయనాలు మనుషులలో తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్లు గుర్తించారు. ప్రధానంగా ఎండ్రకాయలు, రొయ్యల్లో ‘ఫరెవర్ కెమికల్స్‘ అని పిలువబడే పాలీ-ఫ్లోరోఅల్కైల్ పదార్ధాలు (PFAS) పెద్ద మొత్తంలో చేరినట్లు గుర్తించారు. వీటిని తినడం వల్ల ఆ విష పదార్థాలు మనుషుల్లోకి చేరి పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్లు తెలిపారు.
కఠినమైన హెల్త్ గైడ్ లైన్స్ అవసరం
నిజానికి సురక్షితమైన సీ ఫుడ్ వినియోగం కోసం ఆయా ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించాయి. మెర్క్యురీ సహా ఇతర కలుషిత పదార్థాలు ఉండే సీ పుడ్స్ ను అమ్మకూడదనే గైడ్ లైన్స్ గతంలోనే జారీ చేశాయి. అయితే, PFAS విషయంలో ఎలాంటి గైడ్ లైన్స్ లేవని డార్ట్ మౌత్ కాలేజీ పరిశోధకులు తెలిపారు. ప్రజలకు సురక్షితమైన సీ ఫుడ్స్ అందించేలా కఠినమైన పబ్లిక్ హెల్త్ గైడ్ లైన్స్ రూపొందించాలని వెల్లడించారు. “సీ ఫుడ్ తినకూడదనేది మా ఉద్దేశం కాదు. సీ ఫుడ్ లీన్ ప్రొటీన్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలను పుష్కలంగా అందిస్తుంది. కానీ, సీ ఫుడ్ లో PFASను ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సీఫుడ్ తీసుకునే వాళ్లు PFAS విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు హానికరమైన సీ ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది” అని ఈ పరిశోధనను లీడ్ చేసిన ఎపిడెమియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మేగాన్ రొమానో వెల్లడించారు.
రొయ్యలు, ఎండ్రకాయలు మరీ ప్రమాదం
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధన బృందం ప్రజలు ఎక్కువగా తినే 26 రకాల సీ పుడ్‌ను పరిశీలించారు. కాడ్, హాడాక్, ఎండ్రకాయలు, సాల్మన్, స్కాలోప్, రొయ్యలుపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. రొయ్యల్లో గ్రాము మాంసానికి 1.74 శాతం, ఎండ్రకాయల్లో ఒక గ్రాము మాంసానికి 3.30 నానో గ్రాముల PFAS కలిగి ఉన్నట్లు గుర్తించారు. అధిక మొత్తంలో PFAS కలిగి ఉన్న సీఫుడ్ కారణంగా చాలా సమస్యలు ఎదురవుతాయని వెల్లడించారు. ఈ PFAS ప్రజలు, వన్యప్రాణులతో పాటు పర్యావరణానికి హానికరం మారుతుందన్నారు.
Read Also: గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అది స్మోకింగ్ కంటే ప్రమాదకరమట, ఎందుకంటే?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.