Neck Cancer: మనదేశంలో పెరుగుతున్న మెడ క్యాన్సర్ కేసులు, ఇది ఎందుకు వస్తుందంటే
మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే మెడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
అనేక క్యాన్సర్ రకాలలో మెడ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా అధికంగా వస్తున్న క్యాన్సర్లలో ఆరో స్థానంలో ఉంది. వీటిలో 57.5% కేసులు ఆసియాలోనే నమోదవుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోనే ఎక్కువగా మెడ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ చెబుతున్న ప్రకారము 2040 నాటికి ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య 50 నుంచి 60 శాతానికి పెరుగుతుందని అంచనా.
మెడ క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు ప్రధానంగా ప్రభావితం అవుతున్నారు. అలాగే 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారు కూడా 25% వరకు ప్రభావితం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మారుతున్న జీవనశైలి, పొగాకు వినియోగం, మద్యానికి బానిస కావడం వంటివి మెడ క్యాన్సర్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు వైద్యులు.
మెడ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారకాలను వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పొగాకు వాడే వారిలో ఇది వచ్చే అవకాశం ఉంది. అంటే సిగరెట్లు కాల్చేవారు లేదా పొగాకును నమిలే వారు కూడా దీని బారిన పడే అవకాశం ఎక్కువ. పాన్ మసాలాలను ఎప్పుడూ నమిలే వాళ్ళు, ఆల్కహాల్ తాగే వారు కూడా ఈ మెడ క్యాన్సర్ బారిన పడతారు. ఎందుకంటే వీటివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. పొగాకు, ఆల్కహాల్ రెండింటినీ ఎక్కువగా ఉపయోగించేవారు మెడ క్యాన్సర్ ప్రమాదం బారిన పడే అవకాశం 35 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఐరన్, సెలీనియం, జింక్ వంటి ఆహార లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ మెడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అధిక ఉప్పును వినియోగించేవారు, కాల్చిన మాంసాన్ని తినేవారు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అధికంగా తినేవారిలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అధిక సూర్యకాంతికి గురైన వారు, కొన్ని వైరస్‌ల బారిన పడినవారు, వాయు కాలుష్య కారకాలు కూడా ఇది రావడానికి కారణం అవుతుంది. హెచ్ఐవి, హెచ్‌పివి, హెర్పస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ క్యాన్సర్ బారిన పడవచ్చు.
ఇది వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ మెడ క్యాన్సర్ ఉంటే అది కుటుంబంలోని ఏ వ్యక్తినైనా ప్రభావితం చేసే అవకాశం ఎనిమిది రెట్లు ఎక్కువ. జీవక్రియ చేసే సామర్థ్యం తక్కువగా ఉన్న వారిలో, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారిలో ఈ కార్సినోమాలు అభివృద్ధి అయ్యే అవకాశం 500 నుంచి 700 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాలు, ఆర్థికంగా వెనుకబడిన దేశాల మధ్య ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలపై చాలా తేడా కనిపిస్తుంది. వెనుకబడిన దేశాలలో అపరిశుభ్రత, నోటివ్యాధులు వల్ల నోటి క్యాన్సర్లు అధికంగా వస్తున్నట్లు గుర్తించారు. ధూమపానం వల్ల కూడా స్వరపేటిక క్యాన్సర్లు అభివృద్ధి చెందుతున్నాయి.
Also read: ఆరునెలల పాటు ఈ అలవాట్లను ఫాలో అవ్వండి, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.