Skin Care Tips: అమ్మాయిలూ ఈ సీజన్లో మీ చర్మం మెరిసిపోవాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి
మాన్‌సూన్ సీజన్లో చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షాకాలంలో కూడా మీ స్కిన్ మెరిసిపోవాలంటే మీరు ఈ తప్పులు మాత్రం అసలు చేయకండి.
హమ్మయ్య వర్షాకాలం వచ్చేసింది. మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది కదా. కానీ సీజన్ మారడం వల్ల లాభాలే కాదు నష్టాలు ఉన్నాయాండోయ్. ఒక్కసారిగా మారే వాతావరణం వల్ల మన శరీరం కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. మాన్‌సూన్ సీజన్లో చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షాకాలంలో కూడా మీ స్కిన్ మెరిసిపోవాలంటే మీరు ఈ తప్పులు మాత్రం అసలు చేయకండి. చర్మ సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే.
మేకప్ తగ్గించాలి
ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలియదు. మాన్ సూన్ సీజన్లో మేకప్ విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. ఈ సీజన్లో మేకప్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. లోషన్స్ ఎక్కువగా రాసుకోవడం అసలు చెయ్యొద్దు. మీ చర్మ సంరక్షణ కోసం తేలికపాటి మాయిశ్చరైజర్ రాసుకోవడం ఉత్తమమని చర్మ వ్యాది నిపుణులు సూచిస్తున్నారు. మేకప్ ఎక్కువగా వేసుకోవడం వల్ల స్కిన్ అలర్జీలు రావడానికి ఆస్కారం ఉందని మరో డాక్టర్ అంటున్నారు. అంతే కాదు పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తీసేయాలి. మేకప్ ఉంచుకుని నిద్రపోవడం వల్ల మన చర్మానికి సరిగా శ్వాస అందదు. అందువల్ల మన మొహం కాంతివంతంగా ఉండకుండా డల్‌గా ఉంటుంది. కొద్దిగా పౌడర్‌తో కూడిన మేకప్ వేసుకోవడం మంచిదని డెర్మటాలజిస్ట్‌లు చెప్పుకొచ్చారు.
పరిశుభ్రత చాలా ముఖ్యం
చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తేమ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో వ్యక్తిగత శుభ్రత పాటించడం ఎంతో అవసరం. అంతే కాదు రోజుకి రెండు సార్లు స్నానం చెయ్యడం మంచిదని వైద్యులు ఇస్తున్న సలహా.
సన్ స్క్రీన్ లోషన్
ఎక్కువగా ఎండ దెబ్బ తగలకుండా చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగిస్తాము. అయితే వర్షాకాలంలో కూడా సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. కాకపోతే అవి చర్మాన్ని దెబ్బతీసేవి కాకుండా వాటర్, సిలికాన్ ఆధారిత సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించడం మంచిదని డెర్మటాలజిస్ట్ సూచిస్తున్నారు.
నీరు బాగా తీసుకోవాలి
వేసవి కాలంలో బాగా దాహం వేయడం వల్ల నీరు ఎక్కువగా తీసుకుంటాము. వర్షాకాలం వచ్చిందంటే మాత్రం మనం చాలా తక్కువగా నీరు తాగుతాం. కానీ అలా చెయ్యకూడదు. మన శరీరానికి తగినంత నీరు కావాలంటే మనం ఎక్కువగా నీరు తాగాలి. తక్కువగా నీటిని తీసుకోవడం వల్ల మన శరీరం డీహైడ్రేట్ కు గురవుతుంది, దాని వల్ల చర్మం మెరిసే కాంతిని కోల్పోతుంది. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలోని మృతకణాలని బయటకి పంపించి కాంతివంతంగా ఉండేలా చూస్తుంది.