Skin Care: మెరిసే చర్మం కోసం లెమన్ బామ్- ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
ప్రకాశవంతమైన చర్మం కోసం ఎన్నో వాడుతూనే ఉంటారు. కానీ బోలెడు ప్రయోజనాలు ఇచ్చే లెమన్ బామ్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
అమ్మాయిలు చర్మ సంరక్షణ కోసం చేయని ప్రయోగాలు ఉండవు, వాడని ప్రొడక్ట్ ఉండదు. కొంతమంది మార్కెట్లోకి స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఏది వచ్చినా అది బాగుందని తెలిస్తే వెంటనే కొనేస్తారు. ఒక్కోసారి అవి చర్మానికి గిట్టకపోతే దుష్ప్రభావాలు వస్తాయి. అయితే వాటి కోసం ప్రయత్నించే బదులు ఈ మూలికా ఔషధ గుణాలు ఉన్న లెమన్ బామ్ ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లెమన్ బామ్ అనగానే ఇది నిమ్మకాయ అనుకునేరు కానే కాదు. ఇది పుదీనా జాతికి చెందిన మొక్క. చూసేందుకు కొంచెం పుదీనాలానే ఉంటుంది. ఈ మొక్కతో తయారు చేసిన నూనె లేదా ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే మీ అందం ముందర ఏది సాటి రాదు. చర్మ సంబంధిత ఎటువంటి సమస్యకి అయినా ఇది గొప్ప ఔషధం అనే చెప్పాలి. మొటిమలు దగ్గర నుంచి వృద్ధాప్య సంకెతాలు తగ్గించే వరకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది.
మొటిమలకి గుడ్ బై
లెమన్ బామ్ మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని శాంతపరుస్తాయి. దీనిలో ఉండే చల్లదనం మొటిమల బారిన పడిన చర్మాన్ని తిరిగి పునరుజ్జీవంగా తయారు చేస్తుంది. ఇది చర్మాన్ని లోపల నుంచి నయం చేసేలా చేస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు అయితే లెమన్ బామ్ రాసుకోవడం వల్ల మొటిమల సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు.
వుద్ధాప్య ఛాయాలు తగ్గిస్తుంది
చర్మానికి అవసరమైన పోషణ అందిస్తుంది. రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. ఇది రాసుకోవడం వల్ల వృద్ధాప్య సంకేతాల నుంచి బయట పడొచ్చు. ముడతలు లేని చర్మాన్ని అందిస్తుంది. చర్మం బిగుతుగా ధృడంగా, మరింత మెరిసేలా చేస్తుంది. లెమన్ బామ్ తైలం రాసుకోవడం వల చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి డార్క్ సర్కిల్స్ పోగొడుతుంది. మీకు సహజమైన అందాన్ని అందిస్తుంది.
సన్ స్క్రీన్
లెమన్ బామ్ లో కెఫిక్, రోస్మరినిక్ యాసిడ్ ఉంటాయి. దీన్ని సన్ స్క్రీన్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇది UV రేడియేషన్ నుంచి చర్మం నష్టపోకుండా పైపొరల నుంచి లోతైన చర్మ పొరలలోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది UV కిరణాల వల్ల కలిగే నష్టాన్ని తొలగిస్తుంది.
డీప్ క్లేన్సర్
మృతకణాలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ని తొలగించి రంధ్రాలని క్లియర్ చేస్తుంది. పుదీనా మాదిరిగా ఇది కూడా చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది.
దోమలని దరిచేరనివ్వదు
దీన్ని బగ్ రిపెల్లెంట్‌గా కూడా ఉపయోగించవచ్చు. బయట పెరట్లో కూర్చున్నప్పుడో లేదా ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లెమన్ బామ్ ఆకులు చూర్ణం చేసుకుని వాటిని చర్మంపై(మొహం వద్దు) రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దోమలు దగ్గరకి కూడా రావు.
ఆహారంలో కూడా
లెమన్ బామ్ ఆకులని రుచికరమైన ఆహారంగా తయారు చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. దీని ఆకులని టీలో వేసుకుని హెర్బల్ టీ గా చేసుకోవచ్చు. నాన్ వెజ్ వంటకాల్లో కూడా దీన్ని వేసుకుంటారు. ఈ ఆకులు ఐస్ ట్రేలో ఉంచి నీళ్ళు పోసి క్యూబ్స్ అయిన తర్వాత వాటిని టీ లేదా నిమ్మరసంలో వేసుకుని తాగొచ్చు.
సృజనాత్మకత ఉండాలే కానీ లెమన్ బామ్ ని ఎన్ని రకాలుగా అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ నూనెతో తేనె లేదా గ్లిజరిన్ తో కలిపి టోనర్ గా ఉపయోగించుకోవచ్చు. హెయిర్ ఆయిల్ తో కలిపి జుట్టుకి అప్లై చేసుకోవచ్చు. మీ తోటలోనూ దీన్ని పెంచుకోవచ్చు. ఇవి ఉండటం వల్లఅ సీతాకోకచిలుకలు, తేనెటీగలని ఆకర్షిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: పొడి దగ్గు నిరంతరం వస్తుందా? కోవిడ్ దగ్గు ఏమో పరీక్షించుకోండి