Watermelon War : పుచ్చకాయ కోసం యుద్ధం - వేల మంది మృతి ! ఇది రియల్ వార్ స్టోరీ
ఒక్క పుచ్చకాయ కోసం యుద్ధం జరుగుతుందా ? వేల మంది సైనికుల ప్రాణాలు పణంగా పెడతారా ? పెట్టారు . ఇండియాలోనే జరిగిన ఆ యుద్ధం వివరాలు ఇవే
మన ఇంట్లో దోసకాయ మొక్క నాటాం. అది పెరిగి పెద్దయింది. కానీ పక్కింటి మీదకూ పాకింది. అక్కడ కాయలు కూడా కాసింది. ఇప్పుడు ఆ కాయలు మనవా ? పక్కింటి వారివా ? . మనమైతే మనవే అని చెబుతాం. మరి పక్కింటి వారు ఏమంటారు..? మా ఇంటి మీద కాశాయి కాబట్టి మావే అంటారు. ఈ పంచాయతీ తెగుతుందా ? తెగనే తెగదు. ఒక్కో సారి తలలు కూడా తెగుతాయి. కానీ పంచాయతీ మాత్రం తెగదు. ఎందుకంటే ఆ గొడవలోనే అంత మహత్యం ఉంది. ఇది ఇంటి పక్కన వేసిన పాదులోదా ? పొలం లోదా ? అన్నది సమస్య కానే కాదు.. మొక్క ఓ చోట.. కాయలు మరో చోట కాసిన ప్రతీ చోటా ఉత్పన్నమయ్యే సమస్య. అది దోసకాయనా.. పుచ్చకాయనా అన్నది కూడా మ్యాటర్ కాదు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఇలాంటి గొడవలు ఆధునిక కాలలోనే జరగడం లేదు. ఈ సంప్రదాయం పూర్వ కాలం నుంచి ఉంది. అప్పట్లో ఇంకా ఎక్కువగా ఉండేది. ఎంతలా అంటే యుద్ధం చేసుకునేంతలా..!
పూర్వకాలంలో అంటే క్రీ.శ 1644లో బికనీర్, నాగౌర్ అనే రాజ్యాలు ఉండేవి. బికనీర్ రాజ్యంలోని సరిహద్దులోని ఓ గ్రామంలో పుచ్చకాయ విత్తనం నాటారు. బాగా వర్షాలు పడ్డాయో లే్కపోతే.. ఆ గ్రామం తలరాత బాగో లేదో కానీ ఆ చెట్టు విరగ కాసింది. విరగకాస్తే తలరాత బాగో లేదని ఎందుకు అనాల్సి వచ్చిందంటే... ఆ చెట్టు వల్లే ఓ భారీ యుద్ధం జరిగింది మరి. ఆ చెట్టు విరకాస్తూ.. పాకుతూ.. పాకుతూ పక్క దేశానికి వెళ్లిపోయింది. అంటే నాగౌర్ రాజ్యంలోకి వెళ్లిపోయింది. అక్కడ కూడా పుచ్చకాయలను కాసింది. మరి ఆ రాజ్యం వాళ్లు అయ్యా ఇది మీ మొక్క.. మీ పుచ్చకాయ మీరు తీసుకోండి అని ఇచ్చి ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ వారు మా రాజ్యం.. మా భూమి మీద కాసింది కాబట్టి మాదే అని కోసుకుని తిన్నారు.
ఇది బికనీర్ ప్రజలకు నచ్చలేదు. వెంటనే వెళ్లి తమ రాజుగారికి విన్నవించుకున్నారు. ఆ రాజు గారు ఓ పుచ్చకాయే కదా అని లైట్ తీసుకుని ఉంటే ఇప్పుడు మనం చరిత్ర లో జరిగిన యుద్ధం గురించి చెప్పుకోవాల్సిన వచ్చేదే కాదు. ఆ రాజు మరింత పట్టుదలకు పోయి.. అది పుచ్చకాయ మాత్రమే కాదు.. ఇజ్జత్‌కీ సవాల్ అనే స్థితికి తెచ్చుకున్నారు. చివరికి యుద్ధం తప్పలేదు.
ఒక్క పుచ్చకాయ వివాదం ఎన్నో తలల్ని తెగ్గొట్టింది. ఇద్దరూ వేర్వేరు రాజ్యాలకు రాజులు అయినప్పిటకీ మొఘల్ రాజులకు సామంతులుగా ఉన్నారు. తమ సామంతులు పుచ్చకాయ కోసం యుద్ధం చేసుకుని కొట్టుకు చస్తున్నారని తెలుసుకుని ఆపేందుకు వచ్చే సరికి వేల మంది చనిపోయారు. ఆ తర్వాత యుద్ధం ఆగిపోయింది. కానీ పుచ్చకాయ చేసిన యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది.
అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చకాయ కానీ దోసకాయ కానీ మరో కాయ కానీ కోసుకుని తినాలని అనిపిస్తే దాని పాదు ఎక్కడుందో చూసుకోవడం బెటర్. ఎందుకంటే చరిత్రను మనం మర్చిపోలేం. పుటుక్కు జర డుబుక్కుమే అని ఊరకనే అనలేదు. ఏదో ఓ చారిత్రక కారణం ఉండే ఉంటుంది.