Covid 19 Cases in India : నార్త్‌లో కోవిడ్ కలకలం .. మహారాష్ట్రలో కొత్తగా 91 కేసులు.. టీకా ప్రభావం KP.2 వేరియంట్‌పై ఉంటుందా?
KP.2 Variant Symptoms : ఇండియాలో మళ్లీ కోవిడ్ కలకలం మొదలైంది. మహారాష్ట్రలో తాజాగా 91 ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఏయే రాష్ట్రాలపై ఈ వేరియంట్ ప్రభావం ఉందంటే..
Corona Cases in India Last 24 Hours : కోవిడ్ 19 అంత సులువుగా మనల్ని వదిలేలా లేదు. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే వైరస్ రాదు అనుకుంటే కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పోనీ.. వైరస్ పూర్తిగా ఆగిపోయిందా అంటే అదీ లేదు. పైగా ఇప్పుడు మరో వేరియంట్ ఇండియాలో విజృంభిస్తుంది. మహారాష్ట్రలో తాజాగా 91 కోవిడ్ కేసులు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ వైరస్ కోవిడ్ 19 ఓమిక్రాన్ సబ్ వేరియంట్ KP.2గా గుర్తించారు. అయితే ఇది JN.1 వేరియంట్‌నే మించిపోయిందని చెప్తున్నారు. కేవలం మహారాష్ట్రనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఇది విస్తరించే అవకాశముంది అంటున్నారు. ఏయే రాష్ట్రాల్లో KP.2 కేసులు నమోదు కావచ్చో.. వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
KP.2 వేరియంట్ కేసులను ముందుగా మహారాష్ట్రలోనే గుర్తించారు. జనవరిలో దానిని గుర్తిస్తే.. మార్చి నాటికి కేసులు పెరగడం ప్రారంభించాయి. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లనే KP.2 వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుందని గుర్తించారు. ఈ వేరియంట్ JN.1 నుంచి వచ్చింది. అయితే వైరస్ సోకిన తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో ఎక్కువమంది చేరట్లేదని తెలిపారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉన్నా ప్రభావం తక్కువగానే ఉందని నిపుణులు చెప్తున్నారు.
ఆ రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి
KP.1.1, KP.2 వేరియంట్ల సమూహాన్ని FLiRT అంటున్నారు. ఈ సబ్‌వేరియంట్ జనవరిలో ప్రపంచవ్యాప్తంగా బాగా హల్ చల్ చేసింది. ప్రస్తుతం దీని ప్రభావం యూఎస్‌లో ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా చైనాలో కూడా KP.2 వేరియంట్ కేసులు ఎక్కువైతున్నట్లు రీసెంట్‌గానే అక్కడి వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇండియాలో కూడా ఈ వేరియంట్ కేసులు ఎక్కువయ్యాయి. మహారాష్ట్రలో డబుల్ డిజిట్స్‌లో కొత్తకేసులు నమోదు అవుతున్నాయి. పూణేలో 51, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. అమరావతి, ఔరంగాబాద్‌లో ఏడు కేసులు నమోదయ్యాయి. ఇవేకాకుండా మరిన్ని రాష్ట్రాల్లో KP.2 వేరియంట్ విస్తరిస్తుంది.
KP.2 వేరియంట్‌పై టీకా ప్రభావం ఉంటుందా?
కోవిడ్ వ్యాక్సిన్ల ప్రభావం KP.2 వేరియంట్‌పై ఉందా అంటే.. కచ్చితంగా ఉంటుందనే అంటున్నారు నిపుణులు. వైరస్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అందుకే వేరియంట్ సోకినా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు ఉండట్లేదని తెలిపారు. అయితే JN.1 వేరియంట్ వచ్చిన వారికి KP.2 వైరస్ కూడా సోకే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అయితే JN.1 వేరియంట్ కోసం వ్యాక్సిన్ తీసుకుంటే అది KP.2కి పూర్తి రక్షణ అందించకపోవచ్చని కూడా చెప్తున్నారు.
వారికి ఎక్కువ ప్రమాదం..
KP.2 వేరియంట్ కూడా గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ల లక్షణాలే కలిగి ఉంది. కాకపోతే తీవ్రమైన అనారోగ్యానికి గురికాకుండా టీకా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు. కానీ దీని ప్రభావం వయసైపోయిన వారిపై అంటే 60 ఏళ్లు దాటిన వారిపై, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఉంటుందని చెప్తున్నారు. వీరిలో కాస్త లక్షణాలు ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. అయితే ఇలాంటివారు బూస్టర్ డోస్ కూడా తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
లక్షణాలు ఇవే
గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, బాడీ పెయిన్స్, జ్వరం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. కొందరిలో రుచి, వాసన తగ్గుతుంది. జీర్ణాశయ సమస్యలు రావొచ్చు. విరోచనాలు, వికారం, వాంతులు కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. మీలో ఇలాంటి సమస్యలు గుర్తిస్తే వైద్యుల సలహా తీసుకోండి. ప్రాణాంతకం కాకుండా ఉంటుంది.
Also Read : కొవిడ్ న్యూ వేరియంట్ KP.2 వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఉంది.. మరో వేవ్ వచ్చే సూచనలున్నాయా?