TSPSC: టీఎస్‌పీఎస్సీలో మరో సభ్యురాలు రాజీనామా - ఛైర్మన్, కొత్త సభ్యుల నియామకానికి దరఖాస్తు ఇలా
TSPSCలో మరో వికెట్ పడింది. ఇప్పటికే ఛైర్మన్‌తోపాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయగా.. గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు. ఇక తాజాగా మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు.
TSPSC Member Resignation: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో మరో వికెట్ పడింది. ఇప్పటికే ఛైర్మన్‌తోపాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయగా.. గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు. ఇక తాజాగా మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. జనవరి 12న తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆమో భావోద్వేగానికి గురయ్యారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదన్నారు. కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తనను తీవ్రంగా బాధించిందని సుమిత్ర తెలిపారు. ఉద్యోగనామ సంవత్సరం అనుకున్న సంవత్సరమే ఎన్నికల సంవత్సరం కావడంవల్ల తాము ఉద్యోగ నియామక ప్రక్రియను సజావుగా జరపలేకపోయామని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులకు నాటి ప్రభుత్వం సత్వరంగా ఉద్యోగ నియమకాలు చేపట్టడానికి అడుగులు వేసిందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు, వివిధ పార్టీలు ఉద్యోగార్థుల పక్షం వహించి పరీక్షల వాయీదాలకోసం రకరకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచిందన్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, ఆర్.సత్యనారాయణ, కె. రవీందర్‌రెడ్డిలు రాజీనామాలు సమర్పించగా.. వీరి రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. నియామక ప్రక్రియలో పనిచేసే అవకాశం కల్పించిన ఉద్యమ సారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 18న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఆ దరఖాస్తులను secy-ser-gad@telangana.gov.in మెయిల్‌కు పంపించవచ్చని పేర్కొంది. ఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
మిషన్‌కు అయిదుగురు కొత్త సభ్యులు..
తెలంగాణలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించి.. కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు కమిషన్‌లో కొత్తగా అయిదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. కమిషన్‌లో ఛైర్మన్ (TSPSC Chairman), మరో 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, అయిదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో ఛైర్మన్, ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామా సమర్పించగా.. తాజాగా ఆమోదం లభించింది. ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసుకునేందుకు కొత్తగా అయిదుగురిని సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తోంది. పరీక్షలు పూర్తయినా ఫలితాలు ప్రకటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. సభ్యులు వస్తే వాటిని వెల్లడించవచ్చని భావిస్తున్నారు. కొత్తగా నియమించే సభ్యుల్లో ఒకరికి తాత్కాలిక ఛైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారా? అన్న చర్చ సాగుతోంది.
లీకేజీ వ్యవహారంతో..
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక టీఎస్‌పీస్సీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయంలో ఛైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయనను తొలగించడంతోపాటు బోర్డును ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలని ఛైర్మన్ జనార్దన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రాజీనామా నిర్ణయాన్ని అప్పటి భారాస ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్‌లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో కమిషన్‌పై నిరుద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళన చేస్తామంటూ హామీలు ఇచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యం ప్రభుత్వం మారడంతో డిసెంబర్‌లో జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ రాజీనామాకు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
యూపీఎస్సీ తరహాలో మార్పులు..
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తరహాలో పటిష్ఠమైన వ్యవస్థగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని సాయం కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జనవరి 5న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో కలిసి ఇక్కడి యూపీఎస్సీ భవన్‌లో ఛైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్‌కుమార్‌లతో భేటీ అయ్యారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్దిష్ట కాలపరిమితిలోగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తిచేయడం అభినందనీయమని ప్రశంసించారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్, సభ్యుల నియామకం చేపట్టనున్నట్లుగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కమిషన్‌లో అవకతవకలకు తావులేకుండా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తోపాటు, సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు యూపీఎస్సీ చైర్మన్ అంగీకరించారు. ఏడాది లోగా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.