Gurukula Results: నేడు గురుకుల జేఎల్, డీఎల్‌ల తుది ఫలితాల వెల్లడి, మరోసారి అర్హతల పరిశీలన!
తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్ లెక్చరర్ (JL Results), డిగ్రీ లెక్చరర్ (DL Results) పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలను గురుకుల నియామక బోర్డు ఆదివారం (ఫిబ్రవరి 25) వెల్లడించనుంది.
TREI-RB Results: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్ లెక్చరర్ (JL Results), డిగ్రీ లెక్చరర్ (DL Results) పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలను గురుకుల నియామక బోర్డు ఆదివారం (ఫిబ్రవరి 25) వెల్లడించనుంది. జూనియర్ కళాశాలల్లో 1,924 పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 793 లెక్చరర్ పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఫిబ్రవరి రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. అబ్య 19, 20 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు నిర్వహించింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించనుంది. దివ్యాంగుల కేటగిరీలో అర్హత పొందిన అభ్యర్థులకు రెండు రోజుల్లో వైద్య పరీక్షలు చేసి.. ఫలితాలు ప్రకటించనున్నారు.
మరోసారి అర్హతల పరిశీలన..
డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, డెమో తరగతులకు హాజరైన అభ్యర్థుల విద్యార్హతలను గురుకుల నియామక బోర్డు మరోసారి పరిశీలిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అభ్యర్థి స్థానికత, కుల ధ్రువీకరణ, పీజీ, సెట్ పరీక్షలో ఎప్పుడు ఉత్తీర్ణులయ్యారు? నోటిఫికేషన్ తేదీ నాటికి తప్పనిసరి విద్యార్హతలన్నీ సాధించారా? లేదా? అన్న వివరాలను గత రెండు రోజులుగా బోర్డు బృందాలు పరిశీలించాయి. ఆదివారం మధ్యాహ్నానికి బోర్డు సమావేశంలో ఫలితాలను ఆమోదించి.. తుది ఎంపిక జాబితాలను వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకిగానూ బోర్డు గతేడాది ఒకేసారి తొమ్మిది నియామక ప్రకటనలు జారీ చేసింది. ఈ పోస్టుల కోసం దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతేడాది ఆగస్టులో నెలరోజుల పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన బోర్డు.. వెనువెంటనే ప్రాథమిక, తుది కీలను వెల్లడించింది. అప్పుడే ఫలితాలు వెల్లడించాలని భావించినప్పటికీ.. సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో జాప్యం జరిగింది. ఈ వివాదాలు ముగియడంతో మెరిట్ జాబితాలను బోర్డు వెల్లడించింది. మరోవైపు వేగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసింది. తదనంతరం తుది ఎంపిక జాబితాలను వెల్లడించడానికి సిద్దమైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 1 నుంచి 23 వరకు నిర్వహించింది. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు.