Telangana Job News: గ్రూప్-1, 2 పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయంపై హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana High Court Orders: తెలంగాణలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల కింద నిర్వహించే పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయింపుపై రాష్ట్రహైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
Telangana High Court Orders : తెలంగాణలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల కింద నిర్వహించే పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయింపుపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాఖలు చేయని పక్షంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
దివ్యాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ 2(ఆర్) ప్రకారం 40 శాతం వైకల్యం ఉన్నట్లయితే.. గంటకు 20 నిమిషాల అదనపు సమయం ఇవ్వాలన్న నిబంధనను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ పెద్దపల్లికి చెందిన ఎన్.సాయిరాం, మరో ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా పిటిషనర్ తరఫు న్యాయవాది గౌరారం రాజశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేంద్రం జారీచేసిన మెమోను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమలు చేయడంలేదని అన్నారు. గతంలో దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించినా.. ఎలాంటి స్పందనలేదన్నారు. దీనిపై కౌంటరు దాఖలు చేయలేదని కోర్టుకు విన్నవించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావు వాదనలు వినిపిస్తూ.. ఇది ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖ తీసుకోవాల్సిన నిర్ణయమని కోర్టుకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే అమలు చేస్తుందని, ఇందులో తాము నామమాత్రపు ప్రతివాది మాత్రమేనని కోర్టుకు విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విచారణను నవంబరు 28కి వాయిదా వేశారు. నిర్ణీత గడువులోగా కౌంటరు దాఖలు చేయని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
టీఎస్‌పీఎస్సీ తీరుతో నిరుద్యోగుల్లో అసహనం..
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగ యువతకు టీఎస్‌పీఎస్సీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదైనా ఉద్యోగాలు పొందాలన్న వారి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ పక్క పరీక్షల నిర్వహణ చేతకాక డీలాపడిపోయిన టీఎస్‌పీఎస్సీ, మరోపక్క పోలీసు ఉద్యోగాల నియామకాల్లో కోర్టు కేసులు వెరసి.. నిరుద్యోగ యువత ఓర్పును పరీక్షిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. పేపర్ లీక్ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ షెడ్యూలు మారాయి. గ్రూప్-2 పరీక్ష వాయిదాపడింది. గ్రూప్-4 ఫలితాలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి చేరింది. దీంతో ఉద్యోగార్థులో నిరుత్సాహం, అసహనం పెరిగిపోతున్నాయి.
రాష్ట్రంలో ఏ ఉద్యోగాల భర్తీ పూర్తి అవ్వలేదని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రెండుసార్లు వాయిదాపడటం, గ్రూప్-2 పరీక్ష నిరవధిక వాయిదా పడగా.. గ్రూప్-4 ఫలితాలు ఇంకా వెలువడలేదని మండిపడుతున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూలు వచ్చిందని, ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్లేనని ఆవేదన చెందుతున్నారు. గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. రెండోసారి పరీక్ష నిర్వహణలో కూడా లోపాలు తలెత్తిన సంగతి తెలిసిందే. వీటిని పాయింట్ అవుట్ చేస్తూనే కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని... హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే.