TS Job Calendar: తెలంగాణలోనూ జాబ్ క్యాలెండర్.. ఏటా నియామకాలు
Job Colander in Telangana: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలకు సంబంధించి ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త జోన్ల ఏర్పాటు అనంతరం 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించించడంతో వీటిని ఎలా భర్తీ చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో ఏడాది వారీగా ఖాళీలను గుర్తించి అదే సంవత్సరం భర్తీ చేయాలని సీఎం సూచించారు. కొత్త జోనల్ విధానం ద్వారా ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ తయారు చేయాలని తెలిపారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లాల వారీగా పోస్టులు, భర్తీ ప్రక్రియను సత్వరమే చేపట్టాలని సూచించారు.
ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ఒకే సంస్థ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించడం వల్ల దానిపై భారం పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇలా కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు పోలీసు, వైద్య, గురుకుల, నీటి పారుదల శాఖ, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీలను సైతం భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాల భర్తీ ఎక్కువ కాలం సాగడం వల్ల, ఫలితాల కోసం ఎదురుచూస్తూ.. నిరుద్యోగులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. దీనిని నివారించేందుకు యూపీఎస్సీ తరహాలో వార్షిక క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తెస్తామని సీఎం చెప్పారు.
త్వరలో 20 వేల పోస్టుల భర్తీ..
కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, పోస్టుల వర్గీకరణ, ఎన్నికలు వంటి పలు కారణాల వల్ల మూడున్నరేళ్లుగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావం కాస్త తగ్గింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలతో కొత్త జోన్ల ఏర్పాటుపై ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. దీంతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో త్వరలో 20 వేల పోలీసు నియమకాలను భర్తీ చేయనున్నట్లు హోం మంత్రి మహమూద్ అలీ ఇటీవల ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు.
సాగునీటి శాఖలో 700 ఖాళీలు..
తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో మొత్తంగా 1,167 ఖాళీలున్నట్లు శాఖ గుర్తించింది. వెంటనే వీటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. తొలి విడతలో భాగంగా 700 పోస్టులు భర్తీ చేసేందుకు సాగునీటి శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) తదితర పోస్టులు ఇందులో ఉండనున్నాయి. సాగునీటి శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.