AP DSC 2025: యథావిధిగా ఏపీ డీఎస్సీ షెడ్యూల్- వాయిదా పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. పరీక్ష వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షలకు మార్గం సుగమం అయింది. షెడ్యూల్ మార్చాలన్ని పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేయడంతో వాయిదా పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్టు అయింది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇదిగో వాయిదా పడుతుంది అదిగో వాయిదా పడుతుందీ అంటూ ప్రచారం జరిగింది. డీఎస్సీ వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
డీఎస్సీ వాయిదా వేయాలన్న పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పరీక్ష వాయిదా వేసేందుకు అంగీకరించలేదు. వాయిదా వేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసింది. అవసరం అనుకుంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
16, 347 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. అ రోజు నుంచి మే 15 వరకు దరఖాస్తులను తీసుకుంది. గడువు పూర్తి అయిన తర్వాత ఐదు లక్షల అరవై ఏడు వేల అరవై ఏడు దరఖాస్తులు వచ్చాయి. మూడు లక్షల యాభై మూడు వేల ఐదువందల తొంభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు.
వివిధ విభాగాల్లో ఖాళీలు ఇలా ఉన్నాయి.
స్కూల్ అసిస్టెంట్లు 7, 725
సెకండరీ గ్రేడ్ టీచర్లు- 6, 371
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు- 1781
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు- 286
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు- 132
ప్రిన్సిపల్స్ -52
మే 30 నుంచి హల్‌టికెట్లు పంపిణీ చేస్తారు. జూన్ ఆరు నుంచి జరిగే పరీక్షలకు అభ్యర్థులను సన్నద్ధం చేసేందుకు మాక్ టెస్టులను కూడా వెబ్‌సైట్‌లో పెట్టారు. ఈ మాక్ టెస్టులు మే 20 నుంచి అందుబాటులో ఉన్నాయి. జూన్ ఆరున ప్రారంభమయ్యే పరీక్షలు జులై ఆరు వరకు నెల రోజుల పాటు సాగనున్నాయి. పరీక్షలు పూర్తి అయిన రెండో రోజే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అభ్యంతరాలను ఏడు రోజుల వరకు స్వీకరిస్తారు. వాటి ఆధారంగా ఫైనల్ కీ విడుదల చేస్తారు. అక్కడికి ఏడు రోజులకు మెరిట్ జాబితా విడుదల చేస్తారు.





















