SSC MTS Admitcard: మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల - ఎగ్జామ్ ఎప్పటినుంచంటే?
SSC MTS 2024: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2024 హాల్‌టికెట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచారు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SSC MTS 2024 Admitcard Released: దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. రీజియన్లవారీగా అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. అయితే నార్త్ వెస్ట్రన్ రీజియన్ (NWR), సదరన్ రీజియన్ (SR), ఈస్టర్న్ రీజియన్ (ER), కేరళ-కర్ణాటక రీజియన్ (KKR) అడ్మిట్‌కార్డులను విడుదల చేయాల్సి ఉంది. ఈ రీజియన్లకు సంబంధించిన అభ్యర్థుల 'అప్లికేషన్ స్టేటస్' వివరాలను ఇప్పటికే విడుదల చేశారు. ఒకట్రెండు తేదీల్లో ఈ రీజియన్ల అడ్మిట్‌కార్డులు కూడా వెలువడే అవకాశం ఉంది.
అడ్మిట్‌కార్డ్ అనేది పరీక్షకు హాజరు కావడానికి అవసరమైన పత్రం. ఇందులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్షా కేంద్రం మరియు పరీక్ష సమయాలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. చివరి నిమిషంలో ఏవైనా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను పరీక్ష తేదీ కంటే ముందే డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవాలని సూచించారు.
ఎంటీఎస్ అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 30 నుంచి నవంబరు 14 మధ్య SSC MTS 2024 పరీక్ష నిర్వహించనున్నారు. ఎంటీఎస్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తర్వాత, హవల్దార్ పోస్టుల కోసం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహిస్తారు. చివరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపికచేస్తారు.
కేంద్రప్రభుత్వంలోని పలు విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), హవాల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 9583 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్)-6144, హవల్దార్-3439 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థుల ద్వారా జూన్ 28 నుంచి ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరించారు. తాజాగా రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
ALSO READ: ఇంటర్ అర్హతతో 3445 ఎన్టీపీసీ పోస్టులు, పూర్తి వివరాలివే
పరీక్ష విధానం..
✦ మొత్తం 270 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. 120 మార్కులకు మొదటి సెషన్, 150 మార్కులకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.
✦ మొదటి సెషన్‌లో న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & ప్రాబ్లం సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.
✦ రెండో సెషన్‌లో జనరల్ అవెర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.
✦ పరీక్షలో అర్హత మార్కులను జనరల్-30%, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25%, ఇతరులకు-20% గా నిర్ణయించారు.
✦ మొత్తం 15 భాషల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
ఫిజికల్ ఈవెంట్లు: హవల్దార్ పోస్టులకు ఫిజికల్ పరీక్షలు (PET, PST) నిర్వహిస్తారు. అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టులో భాగంగా వాకింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుష అభ్యర్థులు 15 నిమిషాల్లో 1600 మీటర్లు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక మహిళలు అయితే 20 నిమిషాల్లో 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. గర్భధారణ చేసిన మహిళలను ఫిజికల్ టెస్టులకు అనుమతించరు. ఇక ఫిజికల్ స్టాండర్ట్ టెస్టులో భాగంగా పురుషులకు ఎత్తు, ఛాతీ కొలతలు; మహిళలలకు ఎత్తు, బరువు అంశాలు ప్రామాణికంగా తీసుకుంటారు.
దక్షిణాదిలో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.