Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్
ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార పదార్థాలు సరైన రీతిలో తినకపోతే అవే మన ప్రాణాలు తీస్తాయి.
ఆరోగ్యకరమైన కొన్ని ఆహార పదార్థాలు విషపూరితం అవుతాయి. ఒక్కోసారి తీవ్ర నష్టం కలిగించడమే కాదు ప్రాణాల మీదకు వచ్చేస్తుంది. ఎటువంటి ఆహార పదార్థాలు తింటున్నారు. అవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తున్నాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు తీసుకునే పదార్థాలు సరైన విధంగా ఉడికించకపోయినా కూడా ప్రాణాంతకం కావచ్చు. అవేంటంటే..
పచ్చి బంగాళాదుంప
కూర, వేపుడు, కుర్మా ఎలా చేసుకున్నా బంగాళా దుంపలు రుచిగా ఉంటుంది. ఇందులో సోలనేసి అనే సమ్మేళనం ఉంటుంది. ఇది న్యూరో టాక్సిక్. మానవ శరీరానికి చాలా విషపూరితమైనది. నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ సమ్మేళనం ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి, వాంతులు, వికారం, అంతర్గత రక్తస్రావం, కోమాలో వెళ్ళడం, ఒక్కోసారి మరణానికి కారణమవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం 450 గ్రాముల ఆకుపచ్చ బంగాళాదుంపలు తింటే మరణమే శరణ్యం.
జాజికాయ
మిరిస్టిసిన్ అనే క్రియాశీల సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో విచ్చిన్నమైనప్పుడు నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. తలనొప్పి, మైకం వికారం, వాంతులు ఇబ్బంది పెడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం 37 ఏళ్ల మహిళ ఒకసారి 10 గ్రాముల జాజికాయని తీసుకుంది. అది తిన్న గంటన్నరలోనే ఆమెలో తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. బిర్యానీలో తప్పనిసరిగా జాజికాయ వేస్తారు. కానీ దాన్ని చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే వేసుకుంటారు.
చేదు బాదం
హైడ్రోజన్ సైనైడ్ అనే విష సమ్మేళనం కలిగి ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం 20-25 చేదు బాదం పప్పులు తిన్నారంటే మరణమే గతి. మామూలు బాదం మాదిరిగానే వాటిలోని పోషకాలు ఉంటాయి. కానీ మరి చేదు ఎందుకు ఉంటుందంటే.. అందులో కొద్ది మొత్తంలో అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది శరీరం తీసుకున్నప్పుడు సైనెడ్ గా మారిపోతుంది.
రెడ్ కిడ్నీ బీన్స్
వండని లేదా ఉడకని కిడ్నీ బీన్స్ లో లెక్టిన్ ఉంటుంది. ఇవి తింటే పొత్తికడుపు నొప్పి, వికారం, మరణం కూడా సంభవించవచ్చు. వండిన కిడ్నీ బీన్స్ లో లెక్టిన్ ఉండదు. ఒకవేళ తక్కువగా ఉడకబెట్టినట్లయితే లెక్టిన్ స్థాయి 5 రెట్లు పెరుగుతుంది. తీవ్రమైన విషం శరీరంలో చేరుతుంది. బీన్స్ వండతానికి ముందు కనీసం 2 గంటలు నానబెట్టాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
బ్రౌన్ రైస్
మధుమేహులకు షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే బ్రౌన్ రైస్ ఉత్తమ ఎంపిక. సాధారణంగా బియ్యం కడిగేటప్పుడు రెండు గింజలు అయినా నోట్లో వేసుకుంటారు. అలాగే వీటిని కూడా వేసుకుంటున్నారా అవి ఎంత ప్రమాదమో తెలుసా? తెల్ల బియ్యంతో పోల్చినప్పుడు బ్రౌన్ రైస్ లో విషపూరిత సమ్మేళనం ఎక్కువ. ఇది నాడీ వ్యవస్థకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతే కాదు బ్రౌన్ రైస్ ని 4-8 సార్లు కడగాలి. వండటానికి ముందు బియ్యాన్ని 30-40 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడు వాటిని తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.