Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి
తీవ్రమైన ఎండ నేరుగా చర్మంతో పాటు కంటి మీద కూడా ప్రభావం చూపుతుంది. అందుకే వేసవిలో బయటకు వెళ్తున్నట్టయితే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం.
వేసవి కాలంలో అంతా చర్మం గురించే ఆలోచిస్తుంటారు. అయితే, వేసవిలో తీవ్రమైన ఎండ కళ్లకు కూడా ప్రమాదకరమే. అందుకే డాక్టర్లు.. వేసవిలో తప్పకుండా కళ్లను రక్షించుకోవాలని సూచిస్తున్నారు. అసలు వేసవిలో కళ్లకు వచ్చే కష్టాలేమిటీ? ఏ విధంగా మన కళ్లను రక్షించుకోవాలి? తదితర అంశాలను తెలుసుకుందాం.
వేసవిలో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కార్నియకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. వేసవిలో వీచే గాలుల్లో పుప్పొడి వంటి అలర్జీకి కారణమయ్యే కణాలు ఎక్కువగా ఉండవచ్చు. వీటి వల్ల కంటిలో దురదలు రావచ్చు. కళ్లు ఎర్రబారడం, కళ్ల నుంచి నీరు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కళ్లు పొడిబారడం
వేసవిలో వేడిగా ఉండే పొడి గాలి వల్ల, ఎక్కువ సమయం ఏసీల్లో గడపడం వల్ల కళ్లు పొడిబారే సమస్య రావచ్చు. కళ్లకు తగినంత తేమ లేనపుడు కళ్లలో అసౌకర్యంగా ఉండడం, ఎర్రబారడం, కళ్లు గరగరలాడడం వంటి భావన కలుగుతుంది.
సన్ బర్న్
చర్మం మీద సన్ బర్న్ ప్రభావం ఉన్నట్టుగానే కంటి మీద కూడా ఉంటుంది. దీనిని ఫోటోకెరాటిటిస్ అంటారు. సరైన కంటి రక్షణ లేకుండా ఎక్కువ సమయం పాటు యూవీ కిరణాల బారిన పడితే తాత్కాలికంగా కార్నియాకు నష్టం జరగవచ్చు.
అలర్జీ కారకాలు
వేసవి నెలల్లో పూల పొప్పడి వంటి అలెర్జీ కారకాలు కూడా చాలా ఎక్కువగా గాలిలో విస్తరించి ఉంటాయి. వాటి వల్ల కంటిలో దురద, ఎరుపు, కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.
కంటి శుక్లాలు
ఎక్కువ సమయం పాటు యూవీ కిరణాల బారిన పడితే కంటి శుక్లం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది క్రమంగా దృష్టిని బలహీనపరుస్తుంది. కంటిలోని లెన్స్ ను ఈ సమస్య మసకబారుస్తుంది.
ఎలాంటి జాగ్రత్తలు..
- కంటి మీద నేరుగా ఎండ పడకుండా కంటికి నీడనిచ్చే టోపీలు ధరించాలి.
- ఆకు కూరలు, చేపలు, అన్ని రకాల రంగురంగుల పండ్లు కూరగాయలు కంటి ఆరోగ్యానికి దోహదం చేసే పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.
- కంటి ఆరోగ్యాన్ని పరీక్షించుకునేందుకు నేత్ర వైద్యుడిని క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
ఇవి చెయ్యొద్దు
- కళ్లు దురదగా ఉంటే చేతితో రుద్ద కూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. కంటిలో గాయాలకు కూడా కారణం కావచ్చు.
- కళ్లకు ఇబ్బంది లేకుండా రసాయనల బారిన పడకుండా ఉండేందుకు క్లొరినేటెడ్ స్విమ్మింగ్ ఫూల్ లో గాగుల్స్ ధరించకుండా దిగవద్దు.
- వర్క్ షాపుల్లో పనిచేసే వారు కంటికి సంబంధించిన రక్షణ చర్యలు కచ్చితంగా తీసుకోవాలి.
- వేసవిలో కంటి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇలా కంటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవి సమస్యలు లేకుండా గడిపేందుకు అవకాశం ఉంటుంది.
Also Read : ఫాస్ట్ ఫుడ్‌ను లొట్టలేసుకుని తింటున్నారా? మీకే కాదు.. మీ ముందు తరాలకూ ముప్పే, ఏం జరుగుతుందంటే?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.