Respiratory Virus: చిన్నారులకు పొంచి ఉన్న మరో ముప్పు, RSV లక్షణాలు ఇవే
చిన్నారులకు పొంచి ఉన్న మరో ముప్పు.. ఆర్ఎస్వీ. చిన్నారుల శ్వాస వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. ఇంతకీ ఆర్ఎస్వీ లక్షణాలు ఎలా ఉంటాయి?
గత ఏడాది నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది కరోనా వైరస్ మహమ్మారి. పరిశుభ్రత పాటించడంతో పాటు కరోనా వ్యాక్సిన్లు తీసుకోవాలని, మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు దేశాలు ఆంక్షలు సడలిస్తున్నాయి, కోవిడ్19 నిబంధనలను సులభతరం చేస్తున్నాయి.
కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, కరోనా థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే మరిన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. చిన్నారులలో శ్వాస వ్యవస్థకు సంబంధించిన వైరస్ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. పలు దేశాలు అన్‌లాక్ ప్రక్రియకు వెళ్తున్నాయని, తద్వారా చిన్నారులలో శ్వాసవ్యవస్థకు సంబంధించిన ముప్పు పెరిగిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నారులు, టీనేజీ వారిలో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని, పరిస్థితి విషమిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని నిపుణులు గుర్తించారు. కోవిడ్19 నిబంధనలు పాటించేలా ఆయా దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
కొన్ని నివేదికల ప్రకారం.. ఆస్ట్రేలియాలో చిన్నారులలో రిస్పిరేటరీ వైరస్ (Respiratory Syncytial Virus) కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో సైతం పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ పూర్తిగా అమలు చేశారు.
రెస్పిరేటరీ వైరస్ అంటే..
ఒక్కో వైరస్ ఒక్కో శరీర అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్య నిపుణులు ప్రస్తుం శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతున్న రెస్పిరేటరీ వైరస్‌ల బారిన చిన్నారులు పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయిని పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే ఆరోగ్యం క్షీణించి, మరణం సైతం సంభవించే అవకాశాలున్నాయని వైరస్ గురించి తెలిపారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందక ముందు ప్రతి ఏడాది 27 లక్షల మంది చిన్నారులు రెస్పిరేటరీ సిన్సిటల్ వైరస్ (RSV) బారిన పడేవారని నివేదిక చెబుతోంది. చిన్నారులలో అధిక మరణాలు సంభవించడానికి నాలుగో సమస్యగా గుర్తించారు. ప్రస్తుతం శిశువులు సైతం ఈ సమస్య బారిన పడుతున్నారని, పాలిచ్చే తల్లులు మరింత పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
ఆర్ఎస్‌వీ లక్షణాలు..
- జలుబు
- దగ్గు
- జ్వరం
- ఆకలి మందగించడం
- శ్వాసించే సమయంలో శబ్దం
కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ఆగస్టు 25, 2019 నుంచి మే 2, 2020 మధ్యకాలంలో 18,860 ఆర్‌ఎస్‌వీ పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత ఏడాది ఇదే సమయంలో కేవలం 239 పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఈ లక్షణాలు కనిపిస్తే చిన్నారులు, శిశువుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటిస్తూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అర్హులైన వారు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు పదే పదే చెబుతున్నారు.