Oral Health: నోరు పరిశుభ్రంగా లేకపోతే న్యూమోనియా వచ్చే అవకాశం - ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం
దంత ఆరోగ్యానికి, నోటి పరిశుభ్రతకు, న్యుమోనియాకు మధ్య సంబంధం ఉందని చెబుతున్నారు వైద్యులు.
దంతాల ఆరోగ్యాన్ని, నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం కేవలం నోటి వరకే పరిమితం కాదు. నోటి ఆరోగ్య సంరక్షణ ఊపిరితిత్తులను కూడా కాపాడుతుంది. సరైన దంత పరిశుభ్రత లేకపోతే న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో పనిచేస్తున్న అధ్యాపకులు చెబుతున్న ప్రకారం నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల చిగుళ్ళు, ఎముకలలో ఇన్ఫెక్షన్ వాపు వస్తుంది. ఇది చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల దంతాల చుట్టూ ఉన్న ఎముక క్షీణిస్తుంది. చివరకు పళ్ళు రాలిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇది కేవలం నోటి వరకే పరిమితం కాదు. నోటి పరిశుభ్రత లేకపోవడం అనేది శరీరంలోని మిగిలిన భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల న్యుమోనియా వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు సూచిస్తున్నాయని వారు చెబుతున్నారు.
నోటి పరిశుభ్రతకు, న్యుమోనియా రావడానికి సంబంధం ఏమిటో వివరిస్తున్నారు అధ్యాపకులు. నోరు సూక్ష్మక్రిములతో నిండినప్పుడు హానికరమైన బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీనివల్ల దంత సమస్యలు వస్తాయి. వీటిలో కొన్ని బ్యాక్టీరియాలు శ్వాస కోశ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. ఈ బాక్టీరియా నిద్రలో ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ న్యుమోనియాకు కారణం అవుతుంది.
నోటిలోని బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల అవి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. బ్యాక్టీరియల్ ఎంజైమ్‌లు... కణాలను రక్షించే ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాయి. దీనివల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
న్యుమోనియా రాకుండా ఉండాలంటే నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా చూసుకోవాలి. దీనికి నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్టుతో రెండు నిమిషాల పాటు దంతాలను రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి.
దంతాల మధ్య ఆహారం ముక్కలుగా మిగిలిపోకుండా చూసుకోవాలి. నీళ్లు పుక్కిలించి ఉమ్మడం అలాంటివి చేయాలి
ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుని వద్దకు వెళ్లి నోటి పరిశుభ్రతను చెక్ చేయించుకోవాలి.
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలను తాగడం తగ్గించాలి.
ధూమపానం, పొగాకు, మద్యం లాంటి వాటికి దూరంగా ఉండాలి. నోటి సంరక్షణ వల్ల గుండెను కూడా కాపాడుకోవచ్చు. చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టిరియాలు శరీరంలో చేరి గుండె వరకు చేరితే ప్రమాదం. బ్యాక్టిరియాలు శరీరంలో చేరితే విషపూరితంగా మారుతాయి. ఇవి రక్త ప్రసరణలో అడ్డంకులకు కారణం అవుతాయి. దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగదు. కాబట్టి నోటి శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Also read: మన భారతీయులు రోజుకు ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదట - చెబుతున్న సర్వే
Also read: కోవిడ్ వైరస్ పుట్టింది గబ్బిలాల్లో కాదు మనుషుల్లోనే, చైనీస్ శాస్త్రవేత్త కొత్త వాదన
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.