Covibesity: కోవిబెసిటీతో జాగ్రత్త.. ముప్పు ఎక్కువే
ఊబకాయులపై కోవిడ్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. సాధారణ రోగులతో పోలిస్తే కరోనా సోకిన ఊబకాయుల్లో ఏడింతలు అధికంగా ముప్పు ఉందని గుర్తించింది.
అధిక బరువుతో బాధపడేవారు గుండె జబ్బులు, కేన్సర్, షుగర్ సహా అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఊబకాయులపై కోవిడ్ వైరస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉందనే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. సాధారణ రోగులతో పోలిస్తే కరోనా సోకిన ఊబకాయుల్లో ఏడింతలు అధికంగా ముప్పు ఉందని గుర్తించింది. ఇదే విషయాన్ని గతంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సైతం వెల్లడించింది. కోవిడ్ బారిన పడిన ఊబకాయులు ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని హెచ్చరించింది.
కోవిడ్ కారణంగా జీవనశైలిలో వచ్చిన మార్పులతో చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. ఇటీవల డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021 జూన్ 21 నాటికి ప్రపంచవ్యాప్తంగా 178,118,597 కరోనా కేసులు నమోదు కాగా.. 3,864,180 మంది మరణించారు. కోవిడ్ బారిన పడిన ఊబకాయుల్లో దాదాపు 85 శాతం మందికి వెంటిలేటర్ అవసరమైందని తెలిపింది. మిగతా వారిలో ఇది 62 శాతంగా ఉందని పేర్కొంది. ఆస్ట్రేలియా, మలేసియా సహా అన్ని దేశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది.
కారణాలు ఏంటి?
ఊబకాయం వల్ల శరీర దృఢత్వం తగ్గుతుందని.. ఊపిరితిత్తుల పనితీరు కూడా మందగిస్తుందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు వల్ల రక్తంలోని గ్లూకోజ్ ను శరీరంలోని కణాలు సరిగా వినియోగించుకోలేవు. దీని వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి బీపీతో పాటు ఇతర శారీరక రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి కోవిడ్ సోకితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా వెంటిలేటర్ సాయంతో శ్వాస అందించాల్సి వస్తుందని అంటున్నారు. హానికారక సూక్ష్మ క్రిముల నుంచి మన శరీరాన్ని రక్షించాలంటే బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. ఊబకాయంతో బాధపడేవారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం కూడా కోవిడ్ ముప్పు ఎక్కువ అయ్యేలా చేస్తోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల్లో శారీరక శ్రమ తగ్గుతోందని అమెరికా ఫ్లోరిడాలోని బెకాన్ కాలేజీకి చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ ఏజే మార్స్ డెన్ వెల్లడించారు. ఫలితంగా ఊబకాయం, డయాబెటిస్ బారిన పడుతున్నారని తెలిపారు.
కొవిబేసిటీతో తస్మాత్..
కోవిడ్, ఊబకాయం రెండింటినీ కలిపి కోవిబేసిటీగా చెబుతున్నారు. కోవిబేసిటీ బారిన పడకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు ప్రతి అరగంటకోసారి బ్రేక్ ఇచ్చి.. కాస్త అటూ ఇటూ నడవాలి. ఒత్తిడి కూడా ఊబకాయానికి కారకమని పలు సర్వేల్లో తేలింది. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండండి.