India's First mRNA Vaccine: ఆ టీకా రెండు, మూడో దశల ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి
ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో దేశీయంగా రూపొందించిన తొలి కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని తాజా ప్రయోగాల్లో తేలింది. దీంతో ఈ టీకాపై రెండు, మూడో దశల ప్రయోగాలను కొనసాగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
కరోనా వ్యాక్సిన్ ల తయారీలో భారత్ స్పీడు పెంచింది. ఇప్పటికే దేశీయంగా తయారైన కొవాగ్జిన్ టీకా పంపిణీ చేస్తుండగా.. ఇటీవల జైకోవ్-డీ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తాజాగా మరో పురోగతి సాధించింది. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో దేశీయంగా రూపొందించిన తొలి కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని తాజా ప్రయోగాల్లో తేలింది. దీంతో ఈ టీకాపై రెండు, మూడో దశల ప్రయోగాలను కొనసాగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Department of Biotechnology (DBT)-Biotechnology Industry Research Assistance Council (BIRAC) supported India's first mRNA-based vaccine found to be safe gets a nod from the Drugs Controller General of India to move into Phase II/III trial pic.twitter.com/Q7r6udDO1U
— ANI (@ANI) August 24, 2021
సురక్షితమే..
పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మా కంపెనీ HGCO19 ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాను రూపొందించింది. ఈ వ్యాక్సిన్ పై జరిపిన ప్రయోగ ఫలితాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీసీఎస్ఓ)కు అందజేసింది. ఈ ఫలితాలను సబ్జెక్ట్ నిపుణుల కమిటీ విశ్లేషించి.. ఈ టీకా సురక్షితమేనని తేల్చింది.
తొలి దశ ప్రయోగాలు సురక్షితమని తేలడంతో రెండు, మూడో దశల క్లినికల్ ట్రయల్స్ పై సంస్థ దృష్టి పెట్టింది. అమెరికాకు చెందిన ఫైజర్- బయోఎన్ టెక్, మోడెర్నా తయారు చేసిన టీకాలు ఎంఆర్ఎన్ఏ విధానంలోనే అభివృద్ధి చేశారు.
జైకోవ్-డీ..
గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ.. ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్ టీకా. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇటీవల అనుమతించింది.