Marburg Virus: ముంచుకొస్తున్న ‘మార్బర్గ్ వైరస్’.. కరోనా కంటే ప్రాణాంతకం, లక్షణాలివే!
కరోనా వైరస్ పీడ ఇంకా వదల్లేదు. అప్పుడే మరో ప్రాణాంతక వైరస్ దాడి చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ వైరస్ గురించి తెలుసుకుని.. ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉందాం.
ఇప్పటికే ప్రపంచం కరోనా వైరస్‌తో విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారి ఇంకా వీడకుండానే మరో వైరస్ కోరాలు చాచి మించేయడానికి సిద్ధమైపోయింది. అదే.. ‘మార్బర్గ్ వైరస్’ (Marburg virus). పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో ఈ కొత్త వైరస్‌ను కనుగొన్నారు. ఆగస్టు 2న గుక్కెడో ప్రిఫెక్చర్‌లో ఈ వైరస్ సోకి ఓ వ్యక్తి మరణించాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించడంతో ప్రపంచం అప్రమత్తమైంది.
చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన నమూనాల్లో ఈ ప్రాణాంతక వైరస్‌ను కనుగొన్నారు. ఇది కూడా గబ్బిలాల ద్వారానే సోకుతుందని, ఈ వైరస్ సోకితే రోగి 24 నుంచి 88 శాతం చనిపోయే అవకాశాలున్నాయని WHO పేర్కొంది. ఈ వైరస్ కూడా కరోనా తరహాలోనే జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని పేర్కొంది.కోవిడ్-19తో పోల్చితే మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైనదని, చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదటి దశలోనే నియంత్రించాలని WHO ఆఫ్రీకా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ మతిషిడిసో తెలిపారు.
ఎబోలా జాతికి చెందిన ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుందని WHO తెలిపింది. సాధారణంగా ఈ వైరస్ రోసెట్టస్ గబ్బిలాల్లో మాత్రమే కనిపిస్తుందని, అవి నివసించే ప్రాంతాల్లో తిరిగే వ్యక్తులకే ముందుగా ఈ వైరస్ సోకి ఉంటుందని పేర్కొంది. ఈ వైరస్ సోకిన వ్యక్తులను తాకినా, వారి వస్తువులను ఉపయోగించినా వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ వైరస్ పశ్చిమ ఆఫ్రికా నుంచి కెన్యా, కాంగో, ఉగాండా, అంగోలా, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు కూడా వ్యాపించింది.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త:
⦿ మార్బర్గ్ వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం వస్తుంది.
⦿ విపరీతమైన తలనొప్పితో బాధపడతారు.
⦿ చాలా చికాకుగా ఉంటుంది.
⦿ వాంతులు, వికారం ఏర్పడుతుంది.
⦿ కొందరిలో రక్తపు వాంతులవుతాయి.
⦿ కండరాల నొప్పులు ఏర్పడతాయి.
⦿ వైరస్ సోకిన ఏడు రోజుల్లోనే తీవ్రమైన రక్తస్రావం ఏర్పడుతుంది.
చికిత్స ఉందా?: కొత్తగా పుట్టుకొచ్చే ఇలాంటి వైరస్‌లకు తక్షణం చికిత్స అందించడం సాధ్యం కాదు. ప్రస్తుతం మార్బర్గ్ వైరస్‌కు కూడా చికిత్స సాధ్యం కాదు. దీనికి వైరస్ కూడా లేదు. అయితే, లక్షణాలు కనిపించిన వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే బతికే అవకాశాలు ఉండవచ్చని తెలుపుతున్నారు. ఇటీవల మరణించిన ఓ వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహించగా ఎబోలా నెగటివ్ వచ్చింది. అతడి శాంపిళ్లను మరింత లోతుగా పరీక్షించగా ‘మార్బర్గ్’ వైరస్ అని తేలింది. ఇందులో కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. ఎబోలాతో పోల్చితే మార్బర్గ్ వైరస్ ఉనికి తక్కువేనని అంటున్నారు.
Also Read: నీరు ముట్టుకుంటే ఒళ్లంతా మంటలు.. యువతిని వేధిస్తున్న వింత వ్యాధి
Also Read: విటమిన్-డి లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!