Centre on Covid19: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం!
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించనున్నట్లు కేంద్రం తెలిపింది. సుప్రీం కోర్టులో విచారణలో భాగంగా కేంద్రం ఈ మేరకు వెల్లడించింది.
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. కరోనా బాధితులకు సేవలు అందిస్తూ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిహారం అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది.
Ex-gratia to be given also to kin of COVID-19 victims including those involved in relief operations, Centre tells SC
— Press Trust of India (@PTI_News) September 22, 2021
ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సిఫార్సు చేసినట్లు పేర్కొంది. ఈ సహాయం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్డీఆర్ఎఫ్) నుంచి రాష్ట్రాలే చెల్లిస్తాయని స్పష్టం చేసింది.
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం అంశంపై 6 వారాల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలని జూన్ 30న తీర్పులో ఎన్డీఎంఏను సుప్రీం ఆదేశించింది. ఇటీవల కొవిడ్ మృతిగా ఎప్పుడు నిర్ధరిస్తారనే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు ఇవే..
- ఓ వ్యక్తికి కొవిడ్ సోకినప్పటికీ విషం తీసుకోవడం వల్ల, ఆత్మహత్యలతో, హత్యకు గురై, రోడ్డుప్రమాదాలతో మరణిస్తే కొవిడ్ మరణంగా పరిగణించబోరని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.
- ఆర్టీపీసీఆర్, మాలిక్యులర్ పరీక్ష, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష లేదా ఆసుపత్రి/వైద్యుడి పర్యవేక్షణలో చేసిన పరీక్షలను కొవిడ్ నిర్ధరణకు ప్రామాణికంగా భావిస్తారు.
- కొవిడ్ నిర్ధారణైన కేసుల్లో ఆసుపత్రుల్లో లేదా ఇళ్ల వద్ద గానీ మరణిస్తే జనన, మరణ నమోదుచట్టం 1969లోని సెక్షన్ 10 ప్రకారం వైద్యపరంగా మరణ ధ్రువీకరణ పత్రం ఫారం 4, ఫారం 4ఏ నమోదు అధికారికి జారీ చేస్తారు. దీన్ని మాత్రమే కొవిడ్ మరణంగా పరిగణిస్తారు.
- ఆసుపత్రిలో లేదా ఇళ్ల వద్ద చికిత్స పొందుతూ మరణించిన వారి వివరాలను 30 రోజుల్లోపు నమోదు చేయిస్తే కొవిడ్ మరణంగా పరిగణిస్తారు.
- ఈ కేసుల నిర్ధారణకు అవసరమైతే జిల్లాస్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
- బంధువుల దరఖాస్తులు, ఫిర్యాదులను ఈ కమిటీ 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది.
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన అధికారులకు సరైన కొవిడ్ మరణాల నమోదుపై శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.
Also Read: Ratnam Pens: స్వదేశీ ఉద్యమస్ఫూర్తిని చాటిచెప్పిన కేవీ రత్నం ఫ్యామిలీ