Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!
కరోనా వ్యాక్సిన్లు కొవిషీల్జ్, కొవాగ్జిన్‌లను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు డీసీజీఐ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.
దేశీయ కరోనా టీకా కొవాగ్జిన్ సహా మన దేశంలో తయారైన కొవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఈ మేరకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది.
అయితే కరోనా టీకాలు మెడికల్ స్టోర్స్‌లో లభించవు. కానీ ఆసుపత్రులు, క్లినిక్స్ కావాలంటే కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ప్రతి ఆరు నెలలకోసారి వ్యాక్సినేషన్ డేటాను డీసీజీఐకు నివేదించాలి. అలానే కొవిన్ యాప్‌లో కూడా అప్‌డేట్ చేయాలి.
ధరలు ఇవే..
ఇప్పటికే టీకాల ధరలను నిర్ణయించనున్నాయి ఆయా ఫార్మా సంస్థలు. సాధారణంగా టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికావర్గాలు పేర్కొన్నాయి. అయితే.. దీనికి రూ.150 సేవా రుసుమ అదనంగా తీసుకునేందుకు అవకాశం ఉంది.
తగ్గితే మంచిదే..
ప్రస్తుతం ప్రైవేటులో కొవాగ్జిన్ ఒక డోసు ధర సేవా రుసుంతో కలిపి రూ.1200 కాగా.. కొవిషీల్డ్ ధర రూ.780గా ఉంది. గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలు అనుమతి పొందాయి. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ ఈనెల 9న ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారం సమర్పించాయి. దీంతో డీసీజీఐ ఈ అనుమతులు జారీ చేసింది.
ప్రస్తుతం దేశీయంగా రెండు టీకాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒకటి భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ కాగా.. మరొకటి సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తోన్న కొవిషీల్డ్. గతంతో పోలిస్తే వ్యాక్సిన్ తక్కువ ధరకే దొరకడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం.