Corona Cases:వైజాగ్‌లో కోవిడ్ కేస్ నిర్దారణ - వైద్యారోగ్య శాఖ కీలక ఆదేశాలు
Corona Cases:వైజాగ్ లో తొలి కోవిడ్ కేస్ నిర్దారణైంది. మద్దిలపాలెం మహిళకు కరోనా సోకింది. ఇప్పటికే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Corona Cases: మళ్లీ కోవిడ్ తన ప్రభావం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సీజన్‌లో తొలి కోవిడ్ కేసు వైజాగ్‌లో నమోదైంది. విశాఖలోని మద్దిలపాలెం పరిసరాల్లోని పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణైంది. ఆమెతోపాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా RTPCR పరీక్షల జరిపి ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ముందుగా మలేరియా లేదా డెంగీ అని భావించి పరీక్షలు జరిపిన డాక్టర్లు చివరకు కోవిడ్ పాజిటివ్ అని తేల్చారు. వైజాగ్‌లోని విజయ డయాగ్నస్టిక్స్‌లో ఈ పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం ఆమెని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి వారం రోజులపాటు హోంఐసోలేషన్‌లో ఉంచాల్సిందిగా వైద్యులు సూచించారు. ఆమె ఇంటికి చెందిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులు సూచించారు.
రెండు ల్యాబ్‌ల్లో నిర్దారణ
ముందుగా మహిళను పరీక్షించిన విజయ ల్యాబ్ రిఫర్ చేయడంతో KGHలో కూడా పరీక్షలు జరిపి అక్కడ కూడా పాజిటివ్ అని తేలడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.
ట్రావెల్ రికార్డు లేదు-ఎలా సోకిందో తెలీదు
సదరు మహిళ గత 15 రోజులగా ఎక్కడా ట్రావెల్ చేయలేదని చెబుతున్నట్టు సమాచారం. అయితే ఆమె ఈ 15 రోజుల్లో ఎవరిని కలిసింది అనే వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. భయపడాల్సిన పనిలేదని అలా అని అజాగ్రత్తగా ఉండొద్దని నగర ప్రజలకు అధికారులు తెలియజేశారు.
కరోనా మార్గదర్శకాలు విడుదల చేసిన వైద్య ఆరోగ్యశాఖ
కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచించింది వైద్య ఆరోగ్యశాఖ. ప్రార్ధన సమావేశాలు సామాజిక సమావేశాలు పార్టీలు ఇతర కార్యక్రమాల వంటి వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది.
ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌లలో మాస్క్‌లు, పిపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులు తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది వైద్య ఆరోగ్యశాఖ.
రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో COVID-19 కేసులు నమోదు అవుతున్నాయి. రోగులు తేలికపాటి ఒత్తిడితో బాధపడుతున్నట్లు గుర్తించారు.





















