Breast Cancer: అద్భుతం - ఒక్క చుక్క లాలాజలంతో బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించవచ్చట, ఇదిగో ఇలా!
Breast Cancer: మనలో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వాటిలో బ్రెస్ట్ కాన్సర్ కూడా ఒకటి
Breast Cancer Test: మనలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కానీ కొంత మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మన అనారోగ్య సమస్యలను వీలైనంత త్వరగా గుర్తిస్తే వీటిని తగ్గించుకోవచ్చు. రోగనిర్ధారణ పరీక్షలు కూడా అందరికి దగ్గరలో ఉండాలి. అప్పుడే ఏ ఆరోగ్య సమస్యను అయినా సులభంగా ఎదుర్కొంటారు.
రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ఇటీవలి పరిశోధనలు ఆశలు కలిగిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌ను రక్తం చుక్క ద్వారా నిర్ధారించే బయోమార్కర్లను హైదరాబాద్ సిసిఎంబి ఇప్పటికే అభివృద్ధి చేసింది. కానీ తాజాగా కనుగొన్న పరికరం మరింత సులభంగా పని చేస్తుంది. ఈ పరికరంతో ఒక చుక్క లాలాజలం ఉపయోగించి కేవలం ఐదు సెకన్లలో వ్యాధిని నిర్ధారించవచ్చు.
అరచేయి పరిణామంలో ఉన్న ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పరికరాన్ని ఫ్లోరిడా, తైవాన్ పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కొత్త పరికరాన్ని ట్రయల్ చేసే ప్రయోగాలలో, పరిశోధకులు పేపర్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్స్‌ను నిర్దిష్ట ప్రోటీన్‌లతో యాంటీబాడీ ద్రావణంలో ఉంచారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, ఐదుగురు రొమ్ము క్యాన్సర్ రోగులలో ఒకరు HER2 పాజిటివ్. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో 80 శాతం మందిలో CA 15-3 స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్ రోగుల నుంచి 17 లాలాజల శాంపిల్స్‌ను సేకరించారు. మరో నలుగురు ఆరోగ్యకరమైన వాలంటీర్ల నుంచి కూడా నమూనాలను తీసుకున్నారు. ఈ శాంపిల్స్ మూడు వేర్వేరు సమూహాలుగా డివైడ్ చేశారు. పరీక్షలలో, పరీక్ష స్ట్రిప్‌పై ఒక చుక్క లాలాజలం ఉంచారు. ఈ పరీక్షలలో కేవలం ఐదు సెకన్లలోనే ఎవరికి రొమ్ము క్యాన్సర్ ఉంది? ఎవరికి లేదనే రిపోర్టులు వచ్చాయట. ఈ పరికరం రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టి చెబుతుందని, ఫలితంగా.. క్యాన్సర్ ముదరడానికి ముందే చికిత్స పొంది ప్రాణాలను కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
MRI స్క్రీనింగ్స్, అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పరికరం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. దీనికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. కేవలం రూ.415కే లభిస్తుంది. అయితే, దీన్ని ఇంకా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురాలేదు. అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసుకుని త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి, పరికరం అందుబాటులోకి వచ్చేందుకు మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ పరికరం అందుబాటులోకి వస్తే ఎంతోమంది మహిళలు రొమ్ము క్యాన్సర్ నుంచి ప్రాణాలతో బయటపడతారు.
Also Read : అలోవెరా జ్యూస్‌తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో.. అలా తీసుకుంటే ఇంకా మంచిదట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.