Vijay Antony: మలేషియాలో బోట్ యాక్సిడెంట్ - ‘బిచ్చగాడు’ హీరోకు తీవ్ర గాయాలు
‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోనికి ప్రమాదం జరిగింది. మలేషియాలో జరిగిన బోటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
‘బిచ్చగాడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు, దర్శకుడు విజయ్ ఆంటోనీ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ‘బిచ్చగాడు-2’ షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. సోమవారం ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విజయ్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. దీంతో హుటాహుటిన విజయ్‌ను కౌలలాంపూర్ హాస్పిటల్‌కు తరలించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘బిచ్చగాడు-2’ షూటింగ్‌లో భాగంగా నీటిలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్ ఆంటోని వాటర్ బోటును నడుపుతున్నాడు. వేగంగా వెళ్తున్న బోటు ఒక్కసారే అదుపు తప్పింది. నేరుగా వెళ్లి కెమేరా సిబ్బందితో వెళ్తున్న పెద్ద బోటును ఢీకొట్టింది. దీంతో విజయ్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం విజయ్‌కు ప్రాణాపాయం ఏమీ లేదని, కోలుకుంటున్నాడని తెలిసింది.
Read Also: నిన్న గోల్డెన్ గ్లోబ్, నేడు క్రిటిక్స్ ఛాయిస్ - అంతర్జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటుతున్న ‘RRR’
2016లో తమిళంలో ‘పిచ్చైక్కరన్’ టైటిల్‌తో విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఈ మూవీని ‘బిచ్చగాడు’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేశారు. హీరో బిచ్చగాడి పాత్రలో నటించడమనేది నిజంగా సాహసమే. దీంతో విజయ్ ఆంటోనీకి ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘బిచ్చగాడు-2’ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ‘బిచ్చగాడు’ మూవీకి శశీ దర్శకత్వం వహించగా, ‘బిచ్చగాడు-2’కు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలను సైతం డూప్ లేకుండా ఆయన స్వయంగా చేస్తున్నట్లు తెలిసింది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్ పై ఆయనే నిర్మాతగా ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు.
View this post on Instagram
ఇటీవల విజయ్ ఆంటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన పోస్టర్ పై ఆసక్తి నెలకొంది. ఈ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ కళ్లకు ఎరుపు రంగు గుడ్డ కట్టుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. దానిపై యాంటీ బికిలీ అని రాసి ఉంది. ఈ సినిమాను ఏకకాలంలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లు తెలియజేశారు. సినిమాను 2023 వేసవిలో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇంకా విడుదల తేదీను ఖరారు చేయలేదు. దీంతో ప్రస్తుతం విజయ్ ఆంటోని పోస్ట్ తో సినిమాపై ఉత్కంఠ నెలకొంది.