(Source: ECI/ABP News/ABP Majha)
Naga Panchami Serial Today February 1st - 'నాగ పంచమి' సీరియల్: మేఘన, మోక్షల పెళ్లిని పంచమి ఆపగలదా? మేఘనను బెదిరించిన తోటికోడళ్లు!
Naga Panchami Serial Today Episode మోక్ష, మేఘన పెళ్లి చేసుకున్నారని పంచమి ఊహించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తి కరంగా మారింది.
Naga Panchami Today Episode: మేఘన బయట నుంచి వస్తే అక్కడే ఉన్న జ్వాల, చిత్రలు ఆమెను పిలిచి ఎక్కడికెళ్లావని అడుగుతారు. మేఘన గుడికి వెళ్లానని సైగ చేస్తుంది. నోటితో చెప్పకుండా సైగ చేస్తున్నావ్ ఏంటి అని చిత్ర అడిగితే మాట్లాడితే మంత్రాలు రాలిపోతాయని జ్వాల సెటైర్ వేస్తుంది.
మేఘన: మనసులో.. నా శక్తులు నాకు రాగానే వీళ్లిద్దరినీ కుక్కలుగా మార్చి నా గేట్ దగ్గర కాపలాగా మార్చుతా..
చిత్ర: ఏంటి అలా చూస్తున్నావ్ మౌనంగా మంత్రాలు చదివి మా ఇద్దరినీ ఏమైనా చేయాలి అనుకుంటున్నావ్ అమ్మా..
మేఘన: నాకు సరిగా శ్లోకాలే తెలీవు ఇక మంత్రాలు ఏం వస్తాయ్.
జ్వాల: నీ గురించి మాకు అంతా తెలుసు. నీ గదిలో నల్ల సంచిలో చేయి పెట్టగానే అంటూ వాళ్లు దెయ్యాలుగా మారిన ఒకర్ని ఒకరు కొట్టుకున్న సంగతి చెప్తారు.
మేఘన: ఆ సంచి గురించి నాకు తెలీదు అండీ.. నా కంటే ముందు ఆ గదిలో ఎవరో ఉన్నట్లు ఉన్నారు. అప్పుడప్పుడు నాకు ఏవేవో శబ్ధాలు వినిపించి చాలా భయం వేస్తుంది. వీళ్లకు కరాళి గుర్తొచ్చినట్లు ఉంది. ఇక జ్వాల, చిత్రలు మోక్షని పెళ్లి చేసుకోవద్దని బెదిరిస్తారు.
పంచమి: స్వామి ఫణేంద్ర కోసం వచ్చాను.
నాగసాధువు: పామురూపంలో ఇక్కడే ఎక్కడో తిరుగుతుంటాడమ్మా.. ఒక దగ్గర కుదురుగా ఉండటం చూడలేదు..
పంచమి: నన్ను నాగలోకం తీసుకెళ్లి పోవాలి అని ఆత్రుత పడుతున్నాడు స్వామి.
నాగసాధువు: అది నీ చేతిలో కూడా లేదు పంచమి. నీ జన్మ నాగఅంశతో ముడిపడిఉన్నా.. నీ జీవితం భూలోకంతో ముడి పెట్టాడు ఆ శివయ్య. జన్మబంధం ఎంత గట్టిదో తాళి బంధం కూడా అంతే పవిత్రమైనది. అది తెంచి వెళ్లిపోవడమో లేక ఇక్కడే ఉండిపోవడమో నీ ఇష్టం కాదు. ఏ ముడి ఎలా విప్పాలో ఎవర్ని ఎవరితో ముడి వేయాలో కాలమే నిర్ణయిస్తుంది.
పంచమి: నా భర్తకు నేను న్యాయం చేయనప్పుడు దూరంగా జరగడమే మేలు అనుకున్నా స్వామి.
నాగసాధువు: మరి ఈ ఆరాటం అంతా ఎందుకుమ్మా.. బంధాలు అన్నీ తెంచుకున్నప్పుడు నాగలోకం వెళ్లిపోవచ్చు కదా..
పంచమి: మోక్షాబాబు సంతోషంగా ఉన్నప్పుడు వెళ్లిపోతా.
నాగసాధువు: తన సంతోషమే నువ్వు అయినప్పుడు నువ్వు పక్కన లేకుండా తనని సంతోషంగా చూడటం జరగదు. నువ్వు వెళ్లటం కుదరదు పంచమి. అదేనమ్మా జగన్నాటకం అంటే.. నువ్వు అనుకున్నవి నువ్వు చేస్తూ ఉండు పంచమి.. నిన్ను ఎక్కడికి చేర్చాలో ఆ శివయ్యే చూసుకుంటాడు.
పంచమి: నేను నీ కోసమే వచ్చాను ఫణేంద్ర కానీ నాగసాధువు గారి మాటలు వింటుంటే మనం నిమిత్తమాత్రులం అన్న తత్త్వం బాగా బోధపడింది.
నాగసాధువు: తత్త్వం ఎలా ఉన్నా ఎవరి పనులు వాళ్లు చేయాల్సిందే.. ఎవరి కర్మలు వాళ్లు అనుభవించాల్సిందే.
పంచమి: ఇప్పుడు అలాంటిదే ఒక సమస్య వచ్చి పడింది స్వామి. నా మీద కోపంతో మోక్షాబాబు నాగకన్య అయిన మేఘనను పెళ్లి చేసుకొని చావడానికి కూడా సిద్ధపడ్డారు. మేఘన విషకన్య అని నేనే చెప్పాను. అయితే తననే పెళ్లి చేసుకొని చనిపోతాను అన్నారు. మనం వెళ్లి ఎలా అయినా ఆ పెళ్లి ఆపాలి ఫణేంద్ర.
ఫణేంద్ర: అంత కన్నా అత్యవసరమైన బాధ్యత పడింది పంచమి. వెంటనే నిన్ను నాగలోకం తీసుకురమ్మని నాగదేవత ఆదేశించింది. మనం వెంటనే నాగలోకం బయల్దేరాలి పంచమి. నాగదేవత మనల్ని క్షమించి తనే స్వయంగా రమ్మని ఆహ్వానించింది. అంటే ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు పంచమి.
పంచమి: నాకు మోక్షాబాబు క్షేమం కన్నా ఏదీ ఎక్కువ కాదు ఫణేంద్ర. నన్ను క్షమించు. నేను నాగలోకం రాలేను.
ఫణేంద్ర: మనసులో.. ఎన్ని చెప్పినా పంచమి తిరిగి తిరగి మోక్షాదగ్గరే ఆగుతుంది.
పంచమి: నేను పట్నానికి వెళ్లాలి ఫణేంద్ర. మేఘనతో మోక్షబాబు పెళ్లి జరగకుండా ఆపాలి. ఆ తర్వాత ఆ కరాళి ఎక్కడు ఉందో తెలుసుకొని తాడోపేడో తేల్చుకోవాలి.
ఫణేంద్ర: అయితే ఇప్పుడు నాతో నాగలోకం రానంటావ్ పంచమి.
నాగసాధువు: గట్టిగా లాగితే ఎంతటి తాడు అయినా తెగిపోతుంది. సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గం. మొదట మీరిద్దరూ వెళ్లి పెళ్లి ఆపే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు.
ఫణేంద్ర: సరే పంచమి నీతో నేను వస్తాను. నీ పని పూర్తి చేసే మనం నాగలోకం వెళ్దాం.
పంచమి: పట్నానికి రేపు వెళ్దాం ఫణేంద్ర.
ఫణేంద్ర: అడవి వరకు నేను తోడు వస్తాను. సరే పంచమి ఉదయాన్నే వస్తాను బయల్దేరుదాం..
శబరి: మీరు అయినా మోక్షతో మాట్లాడి తాను పంచమిని వదిలి ఎందుకు మేఘనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడో తెలుసుకోండిరా..
వరుణ్: లేదు బామ్మ ఇలాంటి విషయాలు వాడు చెప్పడు.
భార్గవ్: నేరుగా పంచమి దగ్గరకు వెళ్లి తెలుసుకోవాలి.
మీనాక్షి: పాపం పంచమి ఆడపిల్ల తనని అడిగితే ఏం చెప్తుంది. ఏ విషయం అయినా మోక్షా ద్వారానే మనం తెలుసుకోవాలి.
శబరి: అదిగో మోక్ష.. నీ పక్కన పంచమిని తప్ప మరొకర్ని ఊహించుకోలేను మనవడా..
మీనాక్షి: నిజం చెప్తున్నా మోక్ష నా వరకు నీ కన్నా పంచమి అంటేనే నాకు ఎక్కువ ఇష్టం తనని వదులుకోవద్దు మోక్ష.
మోక్ష: పంచమి అంటే మీ అందరికీ ఇష్టం నాకు మాత్రం తనే ప్రాణం. మేఘనను పెళ్లి చేసుకుంటాను అంటే అలా అయినా తనకు ఈర్ష్య పుట్టి వస్తుందని ఆశపడ్డాను. కానీ తను రాను అని చెప్పింది. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే నేను రాను నువ్వు వేరే పెళ్లి చేసుకో అంటుంది.
శబరి: మీ అమ్మ తిట్లే తనకు కోపం తెప్పిస్తే నేను వెళ్లి తనకు క్షమాపణలు చెప్పి తీసుకొస్తా మనవడా..
మోక్ష: ప్రయోజనం లేదు శబరి.. నాతో రాకూడదు అని పంచమి గట్టిగా నిర్ణయించుకుంది. పంచమికి కావాల్సింది నేను పెళ్లి చేసుకోవడం.. నాకు కావాల్సింది ఈ జన్మలో కాకపోయినా ఏదో ఒక జన్మలో పంచమితో కలిసి ఉంటడం..
పంచమి: మేఘన, మోక్ష పెళ్లి చేసుకున్నట్లు పంచమి కల కంటుంది. ఉలిక్కపడి లేచి అలా జరగకూడదు అంటుంది. తన తల్లి లేచి ఏమైందని అడగడంతో.. అమ్మా.. మోక్షాబాబు నా మీద కోపంతో ఆ మేఘనను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారమ్మా. మేఘన నాలా నాగకన్య. వాళ్ల పెళ్లి జరిగితే మోక్షాబాబు బతకరు అమ్మ. నాలా తన ఒళ్లు అంతా విషం.
గౌరి: మరి ఆ విషయం మోక్షాబాబుకి తెలీదు.
పంచమి: చెప్పాను అమ్మా అలా చెప్పడమే తప్పు అయిపోయింది. నువ్వు రాకపోతే నేను మేఘనని పెళ్లి చేసుకొని చనిపోతాను అని చెప్పి కోపంగా వెళ్లి పోయారు అమ్మా. ఆయన చెప్పారు అంటే చేస్తారు. ఎలా అయినా ఆ పెళ్లి ఆపాలి.
గౌరి: మేఘనకు ఆ విషయం తెలిసినా ఎలా పెళ్లి చేసుకుంటుంది.
పంచమి: మేఘన నా శత్రువు అయిన కరాళి చేతిలో కీలుబొమ్మలాంటిది. అంతా ఆ కరాళే చేయిస్తుంది. నా మీద కోపంతో ఆ కరాళి మోక్షాబాబు మీద పగ తీర్చుకుంటుంది. అమ్మా అలా జరిగితే నేను ఓడిపోయినట్లే.. మోక్షాబాబు ప్రాణాలు ఎలా అయినా కాపాడాలి.
గౌరి: ఆ కరాళితో నువ్వు ఒక్కదానివే పోరాడలేవు. ఫణేంద్రని కూడా తోడు తీసుకెళ్లు. పడుకో తల్లీ..మరోవైపు వైదేహి పంతుల్ని పిలిపిస్తుంది. మోక్ష, మేఘనల నిశ్చితార్థం, పెళ్లి కి ముహూర్తం చూడమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.