Karthika Deepam 2: ఆకలి తీర్చమన్న రోహిణి... హడలిపోయిన డాక్టర్ బాబు - సంక్రాంతి ఎపిసోడ్‌లో దీపక్క సందడి
Aadivaaram with Star Maa Parivaaram Promo: 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' సంక్రాంతి ఎపిసోడ్ స్పెషల్ ప్రోమో రిలీజ్ కాగా, దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.
బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే షోలలో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కూడా ఒకటి. తాజాగా సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' స్పెషల్ ప్రోమో రిలీజ్ కాగా, అందులో టెలివిజన్ పాపులర్ సెలబ్రిటీలు దీపక్క - డాక్టర్ బాబు సందడి చేశారు.
డైలాగ్స్ తో అదరగొట్టిన దీపక్క
శ్రీముఖి యాంకర్ గా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం ఈ షోలో పలువురు బుల్లితెర ప్రముఖులు సందడి చేస్తూ ఉంటారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా 'కార్తీకదీపం' సీరియల్ ఫేమ్ దీపక్క (ప్రేమి విశ్వనాథ్), డాక్టర్ బాబు (నిరుపమ్) జంట ఈ షోలో పాల్గొన్నట్టుగా ప్రోమోలో చూపించారు. ఎంట్రీలోనే దీపక్క - డాక్టర్ బాబు ఇద్దరూ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ తో అదరగొట్టారు. అయితే ఇదే ప్రోమోలో దీపక్క హైలెట్ గా నిలిచింది. శ్రీముఖి ప్రశ్నకు ఆమె చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ "దీపక్క స్టార్ మా పరివారంలో అప్పుడప్పుడు వస్తుంటారు అంతే. ఎందుకలాగా? " అని ప్రశ్నించింది. దానికి దీపక్క స్పందిస్తూ "నేను సంక్రాంతి లాంటిదాన్ని. సంవత్సరానికి ఒకసారి వచ్చినా... సంవత్సరం మొత్తం గుర్తుంటాను" అంటూ పంచ్ వేసింది.
ఆకలి తీర్చమన్న రోహిణి
ఇక ఇప్పుడు డాక్టర్ బాబు వంతు రాగా... "ఇంతకుముందు మందులు వేశారు. ఇప్పుడు దోశ చట్నీలు వేస్తున్నారు?" అని డాక్టర్ బాబును ప్రశ్నించింది శ్రీముఖి. ఆయన స్పందిస్తూ "అందులో పెద్దగా కష్టమేమీ లేదు. అప్పుడు మందులు ఇచ్చి బాధలు తీర్చాను. ఇప్పుడు దోశలేసి ఆకలి తీరుస్తున్నాను" అని చెప్పాడు. అయితే పక్కనే ఉన్న రోహిణి "మరి నా ఆకలి?" అంటూ హిలేరియస్ పంచ్ వేసింది. దీంతో అక్కడున్న వారంతా తెగ నవ్వేశారు. ఇక ఈ షో రాబోయే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కాబోతోంది.
'కార్తీకదీపం' సీక్వెల్ సక్సెస్ ఫుల్ గా...
డాక్టర్ బాబు, దీపక్క ఇద్దరూ 'కార్తీక దీపం' సీరియల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ సీరియల్ ఎంతగా పాపులర్ అయ్యిందంటే, ఈ సీరియల్ పై మీమ్స్ కూడా సందడి చేశాయి. ఇందులో వంటలక్క - డాక్టర్ బాబు మధ్య కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచింది. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ నటనకు బుల్లితెర ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అని చెప్పాలి. ఇక డాక్టర్ బాబుగా నిరుపమ్ అదరగొట్టారు. 1569 ఎపిసోడ్స్ తో 'కార్తీకదీపం' సీరియల్ దాదాపు ఆరేళ్ల పాటు నిరంతరాయంగా టెలికాస్ట్ అయ్యి, తెలుగులోనే హయ్యస్ట్ టీఆర్పి రేటింగ్ దక్కించుకున్న సీరియల్ గా నిలిచింది. అలాగే మరి తమిళ, మళయాల, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా డబ్ అయ్యింది. ఇక ఒకానొక టైంలో 'కార్తీకదీపం' సీరియల్ కు ఎండ్ కార్డ్ పడడంతో ప్రేక్షకుల బాధ వర్ణనాతీతంగా మారింది. కానీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం 'కార్తీక దీపం 2' పేరుతో ఈ సీరియల్ కంటిన్యూ అవుతోంది. సీక్వెల్ కు కూడా మంచి ఆదరణ దక్కుతోంది.