ARM Teaser: గుడిని దోచిన దొంగ కథ - ఎలివేషన్లు మాత్రం పీక్స్‌లో - టొవినో ‘ఏఆర్ఎం’ తెలుగు టీజర్ చూశారా?
టొవినో థామస్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘ఏఆర్ఎం’ టీజర్ విడుదల అయింది. దీని తెలుగు వెర్షన్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
ARM Telugu Teaser: ‘మిన్నల్ మురళి’ దేశవ్యాప్తంగా మంచి హిట్ కొట్టిన హీరో టొవినో థామస్. ఇప్పుడు ‘ఏఆర్ఎం’ అనే హై బడ్జెట్ పీరియడ్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను అన్ని భాషల్లో విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా టీజర్ నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల అయింది. ఇందులో టొవినో థామస్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక టీజర్ విషయానికి వస్తే... ‘అమ్మమ్మా... నాకు మణియన్ కథ చెప్పవా’ అని చిన్నపాప అడగడంతో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. దానికి వాళ్ల అమ్మమ్మ భయపడి ‘రాత్రి పడుకునేముందు భగవంతుడి నామం జపిస్తూ పడుకో... జ్యోతి దీపాన్ని ఎత్తుకెళ్లిన దొంగ కథా అడుగుతావ్’ అంటుంది. ఆ తర్వాత టొవినో థామస్ ఎంట్రీ ఇస్తాడు. మణియన్, అజయన్, కుంజికేలు అనే మూడు పాత్రల్లో టొవినో కనిపించనున్నట్లు టీజర్‌లో రివీల్ చేశారు.
కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌ను నింపేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయి. చివర్లో టొవినో థామస్ బీడీ కాల్చేటప్పుడు వెనక నుంచి కాగడాలు లేచే షాట్ టీజర్‌కే హైలెట్ అని చెప్పవచ్చు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి ‘ఏఆర్ఎం’తో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. ఐశ్వర్య రాజేష్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ‘మిన్నల్ మురళి’ దర్శకుడు బసిల్ జోసెఫ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. వీరితో పాటు సురభి లక్ష్మి, శివాజిత్, హరీష్ ఉత్తమన్, రోహిణి, ప్రమోద్ శెట్టి, హరీష్ పేరాది, సంజు శివరాం, జగదీష్ కూడా ‘ఏఆర్ఎం’లో ఉన్నారు.
జితిన్ లాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. దిబు నినన్ థామస్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై డాక్టర్ జకారియా థామస్, లిస్టిన్ స్టీఫెన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇటీవలే ‘2018’ సినిమాతో టొవినో థామస్ భారీ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పటికే రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన ‘పులి మురుగన్’ వసూళ్లను మరో వారంలో దాటేలా కనిపిస్తుంది. కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును ‘2018’ అందుకుంది. ఈ కలెక్షన్స్ రెండు, మూడు రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు.
2018లో కేరళలో భారీగా వరదలు వచ్చాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. నాటి విపత్తును ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారు అనే కథాంధంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
కేరళలో అద్భుతం విజయం అందుకున్న ఈ సినిమా త్వరలో తెలుగులోకి విడుదలకానుంది. హిందీ, కన్నడ, తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ‘2018’ ట్రైలర్ విడుదల అయ్యింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఒళ్లు గగుర్పొడిచేలా రూపొందించారు మేకర్స్.