
Ananya Nagalla: అప్పుడు అలాంటి సీన్స్ చేయనని చెప్పాను - కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నా: అనన్య నాగళ్ల
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘తంత్ర’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనన్య బోల్డ్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Ananya Nagalla About Bold Scenes: అచ్చతెలుగు అమ్మాయిలా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అనన్య నాగళ్ల. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాలో సహజ నటనతో చక్కగా ఆకట్టుకుంది. ‘మల్లేశం’ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించింది. కానీ, ప్రస్తుతం రూటు మార్చింది. అందాల ఆరబోత, కిస్ సీన్లకు ఏమాత్రం వెనుకాడబోనంటోంది.
రొమాంటిక్ సీన్లు కూడా నటనలో భాగమే- అనన్య
‘తంత్ర’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న అనన్య బోల్డ్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్ సీన్లలో నటించనని చెప్పినా, ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు చెప్పింది. “తాను ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాలో పెద్ద కిస్ సీన్ ఉంటుంది. ఆ సినిమాకు ఎంత అవసరం? అనేది ఆ సినిమా ట్రైలర్ లాంఛ్, లేదంటే ఆ మూవీ విడుదల అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కానీ, ఆ సందర్భంలో చాలా ముఖ్యం కాబట్టే చేశాను. ‘తంత్ర’ సినిమాలోనూ అన్ని అంశాలు ఉంటాయి. గ్లామర్, రొమాంటిక్ సీన్లు, సోషల్ మెసేజ్, హారర్ అన్నీ ఉంటాయి. ఆయా సినిమాలకు అవసరమైన రీతిలో తప్పకుండా నటిస్తాను. 6 నెలలకు లేదంటే ఏడాదికి ఓసారి మనిషి మారుతూ ఉంటారు. అలా కాకపోతే మన గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. ‘మల్లేశం’ సినిమా సమయంలో నేను ఇండస్ట్రీకి కొత్త. ఎలా చేసినా మనకు రోల్స్ వస్తాయి అనుకున్నాను. అయితే, నటనలో రొమాంటిక్ సీన్లు కూడా ఓ భాగం అని అర్థం చేసుకోవడానికి కొంచెం టైమ్ పట్టింది” అని అనన్య చెప్పుకొచ్చింది.
మార్చి 15న ప్రేక్షకుల ముందుకు ‘తంత్ర’
అనన్య నాగళ్ల హీరోయిన్ గా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హారర్ మూవీ ‘తంత్ర’ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. హారర్ ఎలిమెంట్స్ తో ప్రారంభం నుంచి చివరి వరకు థ్రిల్ కలిగిస్తుంది. ఈ సినిమాలోని చాలా సీన్స్ భయపెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి చిన్న పిల్లలు రాకూడదని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అనన్య పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలు ప్రయోగించబడిన బాధితురాలిగా కనిపింబోతోంది. పల్లెటూర్లలో క్షుద్రపూజలు, చేతబడులు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి సలోని ఓ కీలక పాత్ర పోషిస్తోంది. చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపిస్తోంది. ధనుష్ రఘుముద్రి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నరేష్ బాబు, రవి చైతన్య ‘తంత్ర’ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Also: ఆ టాలీవుడ్ స్టార్ హీరో నన్ను దారుణంగా టార్చర్ పెట్టాడు - నటి కస్తూరి కామెంట్స్ వైరల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
