The Kashmir Files row: నేను ఆ ఉద్దేశంతో అనలేదు నన్ను క్షమించండి : ఇజ్రాయిల్ దర్శుకుడు నడవ్ లాపిడ్
ఈ యేడాది సంచలనం సృష్టించిన సినిమాల్లో ‘కశ్మీరీ ఫైల్స్’ ఒకటి. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల రూపాయలు వసూళ్లు కూడా సాధించింది. అలాగే రాజకీయంగానూ ఈ మూవీ చర్చనీయాంశంగా మారింది.
ఈ యేడాది సంచలనం సృష్టించిన సినిమాల్లో ‘కశ్మీరీ ఫైల్స్’ ఒకటి. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల రూపాయలు వసూళ్లు కూడా సాధించింది. అలాగే రాజకీయంగానూ ఈ మూవీ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాను ఇటీవల గోవా లో జరిగిన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. అక్కడ కూడా ఈ చిత్రం ఓ కొత్త చర్చకు తెరతీసింది. చిత్రోత్సవాల్లో సినిమా ప్రదర్శన అనంతరం జ్యూరీ హెడ్, ఇజ్రాయిల్ డైరెక్టర్ నడవ్ లాపిడ్ ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. నడవ్ పై పలువురు సినీ సెలబ్రెటీలు మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా ఈ రగడ జరుగుతోంది. ఆయన వ్యాఖ్యలపై భారత్‌తోపాటు, ఇజ్రాయెల్‌లో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నావోర్ గిలాన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పగా, ఆ దేశానికి చెందిన నిర్మాతలు డాన్ వాల్మోన్, లియర్ రాజ్‌లు కూడా లాపిడ్ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా నడవ్ తన పై వస్తోన్న విమర్శలపై స్పందించారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడిన లాపిడ్ ‘ఇఫీ’ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. ఎవరినీ కించపరిచే, అవమానపరిచే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. తను మాట్లాడిన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే అందుకు తనను క్షమించాలని ఆయన కోరారు. కేవలం ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని, జ్యూరిలో అందరి అభిప్రాయలు కలసి ఉన్నాయని అన్నారు. అయితే అంతకు ముందు ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పినా తర్వాత మళ్లీ క్షమాపణలు చెప్పారు.
ఇటీవల గోవాలో 53 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ‘ది కశ్మీరీ ఫైల్స్’ సినిమా ప్రదర్శించడాన్ని జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదొక అసభ్యకరమైన సినిమా అని, కేవలం ప్రచారం కోసమే సినిమాను తీసారని ఆరోపించారు. అంతేకాకుండా ఇలాంటి సినిమాల్నిఅంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడం హేయమైన చర్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పలువురు సెలబ్రెటీలు మండిపడ్డారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ నడవ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ”నాడు యూదులపై జరిగిన మారణకాండ నిజమైతే.. నేడు కశ్మీర్‌లో జరిగిన ఊచకోత కూడా నిజమే.. ఆ మనిషికి దేవుడు కాస్త తెలివిని ప్రసాదించాలి” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అలాగే నడవ్ వ్యాఖ్యలపై మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా స్పందించారు. ‘భారతీయులు ఏం చేసినా అది ఇతరులకి ఫాసిస్ట్ చర్యగానే కనిపిస్తుంది, నిజాలు చాలా ప్రమాదకరమైనవి అవి మనుషులతో అబద్దాలు కూడా చెప్పిస్తాయి’ అంటూ నడవ్ కు చురకలంటించారు. అయితే వివాదం మొదలైన వెంటనే ఇజ్రాయిల్ రాయబారి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. నడవ్ అవగాహన లేకుండా మాట్లాడారని, ఆయన మాటలు పట్టించుకోవద్దని చిత్ర బృందాన్ని కోరారు. నడవ్ వ్యాఖ్యలు పట్ల తాను సిగ్గుపడుతున్నా అంటూ వివాదాన్ని తెర దించడానికి ప్రయత్నించారు. అయినా వివాదం సర్దుమనగకపోవడంతో చివరకు నడవ్ దిగివచ్చి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.