Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి, శివాత్మికా రాజశేఖర్, నరేష్ అగస్త్య, వికాస్, దివ్య శ్రీపాద తదితరులు నటించిన చిత్రం 'పంచతంత్రం'. డిసెంబర్ 9న థియేటర్లలోకి వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
బ్రహ్మానందం (Brahmanandam) అంటే వినోదం... వినోదం అంటే బ్రహ్మానందం! కొన్నేళ్ళుగా ఆయన తెలుగు ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్విస్తున్నారు. ఫర్ ఎ ఛేంజ్... వినోదాత్మక పాత్రలో కాకుండా అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలో ఆయన నటించిన చిత్రం 'పంచతంత్రం' (Panchathantram Movie). సముద్రఖని, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర తారాగణం. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
పంచేంద్రియాలు థీమ్‌తో!
ఐదు కథల సమాహారంగా 'పంచతంత్రం' రూపొందింది. స్వాతి & బ్రహ్మానందం పాత్రల పరిచయంతో ట్రైలర్ మొదలైంది. 'హాయ్, మై బుజ్జి బంగారం! వెల్కమ్ బ్యాక్ టు అనథర్ అడ్వెంచర్' అని స్వాతి చెబితే... 'నేను చెప్పబోయే ఐదు కథలకు నేను నా థీమ్ పంచేంద్రియాలు' అని బ్రహ్మానందం చెప్పారు. సుమారు రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్‌లో దర్శకుడు చాలా విషయాలు చెప్పారు. ఐదు కథలూ చూపించారు.
ట్రైలర్‌లో చిన్న షాక్, సర్‌ప్రైజ్ అంటే... వీల్ ఛైర్‌లో స్వాతి కనిపించడం! లైఫ్‌లో ఎన్ని కష్టాలు వచ్చినా కాన్ఫిడెన్స్ కోల్పోకూడదని ఆమె పాత్ర ద్వారా చెప్పినట్టు ఉన్నారు. వికాస్, దివ్య శ్రీపాద భార్యాభర్తలుగా కనిపించారు. ఆ కథ ఎమోషనల్ రైడ్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా గర్భవతి పాత్ర పోషించిన దివ్య శ్రీపాద 'కష్టం వచ్చింది కదా అని దించేసుకోవడానికి ఇది భారం కాదమ్మా! బాధ్యత' అని చెప్పే మాటలో ఎంతో అర్థం ఉంది.
'నీ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటావో... నీతో షేర్ చేసుకునే వారి లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అడ్జస్ట్‌మెంట్స్‌కు ఉన్న వేల్యూ తెలుస్తుంది' అని శివాత్మిక చెప్పే మాట కూడా బావుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. డిసెంబర్ 9న థియేటర్లలోకి సినిమా వస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కుమార్తె పాత్రలో స్వాతి నటించారు.
Also Read : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?
టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమాతో హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రేక్షకుల నుంచి ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇంతకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు... విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన 'అరెరే... అరెరే... మాటే రాదే... మనసే పలికే క్షణములో', 'ఏ రాగమో... నన్నే... రమ్మని పిలుస్తున్నదే...' పాటలకు మంచి స్పందన లభించింది. హృదయానికి హత్తుకునే కథలతో తీసిన చిత్రమిది'' అని చెప్పారు.
దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ ''వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం గారు జీవించారు. ఆయనకు, స్వాతి రెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. ఇంకా మిగతా తారలు అందరూ ఎంతో అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరి పాత్ర బావుంటుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: రాజ్ కె. నల్లి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి.