Rudrangi Teaser: వాడు బలవంతుడైతే నేను భగవంతుడినిరా - ఉత్కంఠభరితంగా ‘రుద్రంగి’ మూవీ టీజర్
జగపతిబాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘రుద్రాంగి’ మూవీ టీజర్ వచ్చేసింది. ఇందులో జగపతిబాబు సరికొత్త మేనరిజంతో ఆకట్టుకుంటున్నాడు.
Rudrangi: టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు నటుడు జగపతి బాబు. దశాబ్దాల కాలం పాటు లవ్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే మారుతున్న సినిమా పరిస్థితులకు అణుగుణంగా ఆయన కూడా నటనలో కొత్త దారులను ఎంచుకున్నారు. గతం కొంత కాలంగా జగపతి బాబు విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. విలన్ పాత్రల్లో జగపతి బాబు నటన బాగుండటంతో ఆయనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆయన నెగిటివ్ పాత్రలో నటించిన సినిమా ‘రుద్రంగి’. ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆశిష్ గాంధీ, మమత మోహన్ దాస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, పోస్టర్ లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
ప్రస్తుత సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. మేకర్స్ కూడా అలాంటి సినిమాల మీదే దృష్టి పెడుతున్నారు. ‘రుద్రంగి’ సినిమాను కూడా ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసునట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన టీజర్ ను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. టీజర్ లో జగపతి బాబు భీమ్ రాజ్ దేశ్ ముఖ్ పాత్రలో చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు. ఇక మమతా మోహన్ దాస్ జ్వాలాభాయ్ దేశ్ ముఖ్ గా దొరసాని పాత్రలో కనిపిస్తోంది. ఆశిష్ గాంధీ మల్లేష్ గ్రామస్తుడి పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం ‘రుద్రంగి’ అనే ఊరి చుట్టూ సాగే కథలా అనిపిస్తోంది. స్వాతంత్య్రానికి ముందు కొంత మంది దొరల పాలనలో ప్రజలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొనే వారు వంటి అంశాలను టీజర్ లో చూపించారు. రుద్రంగి అనే ఊరిలో దొరల హింసాఖాండలకు మల్లేష్ అనే గ్రామస్తుడు అడ్డు తగులుతాడు. అయితే అతను దొరలను ఎలా ఎదుర్కొన్నాడు. మల్లేష్ పై దొరల కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది. అతను ప్రజలను ఎలా కాపాడాడు వంటి అంశాలతో ఈ కథను రూపొందించినట్టు కనిపిస్తోంది.
ఇక జగపతి బాబు విలన్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇందులో ఆయన పాత్ర, ఆహార్యం భయంకరంగా తీర్చిదిద్దారు. మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ లకు మంచి పాత్రలే దక్కాయి. ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించేందుకు ఆర్ట్ వర్క్ పై కూడా దృష్టి పెట్టనట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా జగపతి బాబు చెప్పే ‘వాడు బలవంతుడు అయితే నేను భగవంతుడినిరా’ అంటూ చెప్పే డైలాగ్ బాగుంది. మరి సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. గానవి లక్ష్మణ్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్, సదానందం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ మే 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.