Prabhas Ravan Dahan: ప్రభాస్‌కు అరుదైన గౌరవం, ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో రావణ దహనానికి ఆహ్వానం?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ఢిల్లీలోని లవ కుశ రామ్ లీలా మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. రావణ దహనం చేయనున్నారు.
ప్రభాస్ కు ఆహ్వానం, ఓకే చెప్పిన యంగ్ రెబల్ స్టార్
బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. పాన్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఈ టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ కు అరుదైన గౌరవం దక్కబోతున్నది. ఈ ఏడాది ఢిల్లీలోని లవకుశ రామ్ లీలా మైదానంలో జరగబోయే దసరా ఉత్సవాల్లో రావణ దహనం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇప్పటికే రామ్ లీలా కమిటీ సభ్యులు అతడికి ఆహ్వానం పంపించారు. దసరా ఉత్సవాలకు విశిష్ట అతిథిగా వచ్చి రావణ దహనం చేయాలని ఆహ్వానంలో వెల్లడించారు. ఈ ఆహ్వానానికి ప్రభాస్ సైతం అంగీకరించారు. ఈ ఏడాది అక్టోబర్ 5న విజయ దశమి వేడుకలు జరగనున్నాయి. అయితే ,సెప్టెంబర్ 26 నుంచే ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు ఈసారి అయోధ్యలోని రామ మందిరం రూపంలో నిర్వాహకులు మండపాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఏటా ఒక్కో థీమ్ తో మండపాన్ని నిర్మించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, కృష్ణం రాజు మరణానికి ముందే ఈ ఆహ్వానం ప్రభాస్‌కు అందిందని, అందుకే ఆయన అంగీకరించారని తెలిసింది. మరి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రావణ దహన కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది సందేహమే. అయితే, ఆ కార్యక్రమానికి ఇంకా సమయం ఉండటంతో ప్రభాస్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ దహనం
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్బంగా రావణుడి దిష్టిబొమ్మను కాల్చి వేస్తారు. ఈ ఏడాది దసరా వేడుకల్లో రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు.. ఆదిపురుష్ చిత్రంలో శ్రీ రాముడి పాత్రను పోషిస్తున్న ప్రభాస్ కంటే గొప్పవారు ఎవరుంటారని లవకుశ రామ్ లీలా కమిటీ చీఫ్ అర్జున్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే ప్రభాస్ ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించామని చెప్పారు. రావణుడి దిష్టిబొమ్మను ప్రభాస్ తన బాణంతో దహనం చేస్తారని ఆయన వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దిష్టిబొమ్మలు 100 అడుగుల ఎత్తులో ఉండబోతున్నట్లు ఆయన తెలిపారు. ఎప్పటి లాగే ఈసారి కూడా రావణుడితో పాటు కుంభ కర్ణుడు, మేఘనాథ్ భారీ దిష్టి బొమ్మలను ఏర్పాటు చేయనున్నట్లు అర్జున్ కుమార్ చెప్పారు. రావణుడితో పాటు కుంభ కర్ణుడు, మేఘనాథ్‌ల బొమ్మలను సైతం ప్రభాసే దహనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి నటులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. రావణ దహనం చేశారు.
వచ్చే ఏడాది ‘ఆది పురుష్’ విడుదల
అటు ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ప్రభాస్ బర్త్ డే అయిన అక్టోబర్ 23న ‘ఆది పురుష్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం.