Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు
'ఆదిపురుష్' టీజర్ త్రీడీ స్క్రీనింగ్‌కు హాజరైన ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు... ట్రోల్స్, మీమ్స్‌పై స్పందించారు. 'బాహుబలి'నీ ట్రోల్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush). శ్రీరాముని పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించారు. హిందీలో 'తానాజీ' వంటి విజయవంతమైన సినిమా తీసిన ఓం రౌత్ దర్శకత్వం వహించారు. శ్రీరామ జన్మస్థలం అయోధ్యలో సరయు నదీ తీరంలో ఇటీవల టీజర్ విడుదల చేశారు. అయితే... టీజర్ విడుదల అయిన తర్వాత అనూహ్య రీతిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కార్టూన్ సినిమాలా ఉందని కొందరు, సినిమాలో నటీనటుల వేషధారణపై మరికొందరు విమర్శలు చేశారు. వీటిపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు స్పందించారు.
ప్రభాస్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది - 'దిల్' రాజు
'ఆదిపురుష్' టీజర్ త్రీడీ స్క్రీనింగ్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. తెలుగు మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా టీజర్ చూపించారు. ఆ కార్యక్రమానికి 'దిల్' రాజు (Dil Raju) అటెండ్ అయ్యారు. టీజర్ చూశాక అభినందించాలని ప్రభాస్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చిందన్నారు. ''అక్టోబర్ 2న టీజర్ ఎప్పుడు వస్తుందా? అని ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు... నాలాంటి వాళ్ళు చాలా మంది ఎదురు చూశారు. టీజర్ వచ్చిన వెంటనే... నేను ప్రభాస్‌కు ఫోన్ చేశా. స్విచ్ఛాఫ్ వచ్చింది. 'అమేజింగ్' అని వాయిస్ మెసేజ్ చేశాను'' అని 'దిల్' రాజు పేర్కొన్నారు.
'బాహుబలి'నీ ట్రోల్ చేశారు - 'దిల్' రాజు
'ఆదిపురుష్' టీజర్‌పై వస్తున్న విమర్శల(Adipurush Teaser Trolled)పై కూడా తన స్పీచ్‌లో 'దిల్' రాజు పరోక్షంగా ప్రస్తావించారు. ఇటువంటి సినిమాలు మొబైల్స్‌లో చూడటం కోసం కాదని... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేయాలని ఆయన సెలవిచ్చారు. 'దిల్' రాజు మాట్లాడుతూ ''నాతో పాటు ఇద్దరు ముగ్గురు స్నేహితులు 'ఆదిపురుష్' టీజర్ చూశారు. బావుందన్నారు. గంట తర్వాత ఇంటికి వెళ్ళాను. మీడియాలో కొంత మంది మిత్రులు 'ఎలా ఉంది?' అని అడిగారు. చాలా బావుందని చెప్పాను. 'లేదు సార్... ఇలా అంటున్నారు. అలా అంటున్నారు' అని చెప్పారు. బేసిగ్గా... నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను... 'బాహుబలి 1'ను రాత్రి పన్నెండు గంటలకు శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశా. అయితే, మొదటి రెండు రోజులు ఆ సినిమాను ట్రోల్ చేశారు. ప్రభాస్ శివలింగం ఎత్తుకుంటే... శివలింగం బదులు జండూబామ్ పెట్టారు. సినిమా చూశాక ప్రభాస్‌కు ఫోన్ చేసి 'సూపర్ హిట్' అంటే 'లేదు భయ్యా' అన్నాడు. హ్యాపీగా నిద్రపోమని చెప్పాను. ఇటువంటి సినిమాలు విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. థియేటర్లలో ఫుల్ క్రౌడ్ మధ్య చూసినప్పుడు అది అర్థం అవుతుంది. 'ఆదిపురుష్' కూడా అటువంటి సినిమానే'' అని అన్నారు.
త్రీడీలో చూసి విజిల్స్ వేశా - 'దిల్' రాజు
'ఆదిపురుష్' టీజర్ ఫోనులో చూసినప్పుడు, ఆ తర్వాత ఇంటికి వెళ్లి మరోసారి చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ కలిగిందని 'దిల్' రాజు తెలిపారు. థియేటర్‌లో త్రీడీలో చూసినప్పుడు... విజువల్స్ వచ్చి మీద పడుతుంటే విజిల్స్ వేశానన్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా అద్భుతం సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్ద విజయం సాధిస్తుందని, అందులో ఒక్క శాతం కూడా సందేహం లేదన్నారు. రామాయణం నుంచి ఒక ఎపిసోడ్ తీసుకుని ఈ కాలానికి తగినట్లు సినిమా తీశారన్నారు. అయితే, వాటి మీద కూడా విమర్శలు వస్తున్నాయని 'దిల్' రాజు పేర్కొన్నారు. సినిమా విడుదలైన తొలి రోజు నెగిటివ్ మైండ్‌తో సినిమా చూసే ప్రేక్షకులు ఉంటారని, వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
Also Read : RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!