Ranga Ranga Vaibhavanga: మేనల్లుడి సినిమాపై పవన్ 'జల్సా' రీరిలీజ్ ఎఫెక్ట్!
'జల్సా' సినిమా హడావిడి అయిన మరుసటి రోజు సెప్టెంబర్ 2న వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా విడుదలవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి తన మేనల్లుళ్లు సాయి తేజ్(Sai Tej), వైష్ణవ్ తేజ్(Vaishnav tej) అంటే చాలా ఇష్టం. వారికి తనవంతుగా చాలా సపోర్ట్ ఇస్తుంటారు పవన్. అలాంటిది ఇప్పుడు పవన్ సినిమా రీరిలీజ్ కారణంగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'జల్సా', 'తమ్ముడు' సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ స్క్రీనింగ్స్ వేస్తున్నారు.
ఒకరోజు ముందుగానే అంటే.. సెప్టెంబర్ 1నుంచే షోలు వేయాలని నిర్ణయించుకున్నారు ఫ్యాన్స్. వీలైనన్ని ఎక్కువ థియేటర్లు, షోలలో సినిమాను ప్రదర్శించేలా చూసుకుంటున్నారు. థియేటర్స్ లిస్ట్ చూస్తే ఏదో కొత్త సినిమా రిలీజ్ లానే అనిపిస్తుంది. పవన్ ఫ్యాన్స్ క్రేజ్ అలా ఉంది మరి. అయితే 'జల్సా' సినిమా హడావిడి అయిన మరుసటి రోజు సెప్టెంబర్ 2న వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా విడుదలవుతోంది.
మెగా హీరోల సినిమా అంటే తొలిరోజు టికెట్స్ తెగేది మెగాభిమానుల వలనే. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ 'జల్సా' హడావిడిలో ఉన్నారు. దీంతో 'రంగ రంగ వైభవంగా' సినిమా బుకింగ్స్ ఓపెన్ అయినా.. అటు దృష్టి పెట్టడం లేదు. సెప్టెంబర్ 1న హడావిడి చేయడానికి రెడీ అవుతోన్న మెగా ఫ్యాన్స్.. వెంటనే 'రంగ రంగ వైభవంగా' సినిమాకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారా..? లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!
ఇక 'రంగ రంగ వైభవంగా' సినిమా విషయానికొస్తే.. ఇందులో కేతికా శర్మ(Ketika Sharma) కథానాయిక. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. కథ ప్రకారం.. హీరో హీరోయిన్లు ఇద్దరూ డాక్టర్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో రాధాగా కేతికా శర్మ, రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తుండగా... శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్.
Ranga Ranga Vaibhavanga Trailer: మొన్నామధ్య విడుదల చేసిన సినిమా ట్రైలర్ మొత్తం ఎంతో ఫన్ గా నడిచింది. చిన్నతనంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వలన హీరో, హీరోయిన్లు మాట్లాడుకోవడం మానేస్తారు. ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటారు. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతున్న హీరో కొన్ని పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. ట్రైలర్ అయితే బాగానే కట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!
వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత విడుదలైన 'కొండపొలం' సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో 'రంగ రంగ వైభవంగా' సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వైష్ణవ్ రేంజ్ ని పెంచుతుందో లేదో చూడాలి!
Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు
Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ