Nidhhi Agerwal: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న 'రాజా సాబ్' బ్యూటీ - ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Nidhhi Agerwal: ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టేందుకు రెడీ అయింది.
Nidhhi Agerwal OTT Debut: టాలీవుడ్ ఇస్మార్ బ్యూటీ నిధి అగర్వాల్ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగపెట్టిన ఈమె, 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం పలు తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు 'ఐకిడో' (AIKIDO) అనే ప్రాజెక్ట్ తో డిజిటల్ స్పేస్ లో అడుగుపెడుతోంది.
'రుస్తుమ్', 'ప్యాడ్‌మ్యాన్', 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకనిర్మాత ప్రేరణ అరోరా.. 'ఐకిడో - ది రివెంజ్ చాప్టర్ వన్' అనే ఓటీటీ మూవీని రూపొందిస్తోంది. ఆమెకు ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్టు. ఈ థ్రిల్లర్ లో నిధి అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు జిమ్మీ షెర్గిల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.
'ఐకిడో - ది రివెంజ్ చాప్టర్ 1' చిత్రానికి అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. పీయూష్ ఆదిత్య కథ అందించారు. ప్రేరణ అరోరా సమర్పణలో వీరేంద్ర అరోరా, ఎస్కెజీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫిబ్రవరి 24న నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. నిధి బాలీవుడ్ లోనే తెరంగేట్రం చేసినప్పటికీ, ఆమెకు సౌత్ లోనే మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు డిజిటల్ డెబ్యూ సక్సెస్ అయితే, జాతీయ స్థాయిలో అమ్మడికి మంచి బ్రేక్ దొరికే అవకాశం ఉంది.
ఓటీటీ డెబ్యూ గురించి నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. "ప్రేరణ చేసే చిత్రాలు ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటాయి. ఇంత మంచి స్క్రిప్ట్‌ని నేను కాదనలేకపోయాను. ఇది నన్ను నేను చూడటానికి ఇష్టపడే చిత్రం.. అందుకే ఈ సినిమా కోసం ప్రేరణ నన్ను పిలిచినప్పుడు వెంటనే ఓకే చెప్పేశాను.. టాలీవుడ్ లో ఇద్దరు పెద్ద హీరోలతో చేస్తున్నా డేట్స్ కేటాయించాను. ప్రేరణ చెప్పే కథలో భాగం అవ్వాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మంచి థ్రిల్లింగ్ కథాంశంతో ఓటీటీలోకి అడుగు పెడుతున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాను’’ అని చెప్పింది. ‘‘ఈ మధ్య వెబ్ సిరీస్‌లను ఎక్కువ చూడటం వల్ల ఓటీటీ వేదికగా మరో కొత్త కథను చెప్పాలన్న ఉత్సాహం వచ్చింది’’ అని ప్రేరణ తెలిపింది.
ఇకపోతే నిధి అగర్వాల్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన పంచమి అనే పాత్రలో నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి ఈ హిస్టారికల్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజా సాబ్' సినిమాలోనూ నిధి హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటుగా తమిళ్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'కల్కి 2989 AD' నుంచి మరో లీక్ - కేసులు పెట్టి ఏం లాభం డార్లింగ్?