Thriller Movies On OTT: ఆ ఇంట్లో ప్రతి పాతికేళ్లకు ఒక కుటుంబం మాయం - ఇంతకీ ఆ రహస్యం ఏమిటీ? కిక్కెంచే మూవీ ఇది
Movie Suggestions: ఆ ఇంటి బేస్మెంట్‌లో ఒక డోర్. అందులో వెళ్తే 25 ఏళ్లు ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు. చివరి వరకు వారు టైమ్ ట్రావెల్ చేస్తున్న విషయం వారికే తెలియకుండా సాగే సినిమా ఇది.
Best Thriller Movies On OTT: కొరియన్ మేకర్స్.. థ్రిల్లర్, టైమ్ ట్రావెల్, హారర్ జోనర్లలో చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అని మూవీ లవర్స్ అంతా అంటుంటారు. అలాంటి కొరియన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ చిత్రాల్లో ఒకటి ‘హౌజ్ ఆఫ్ ది డిసప్పియర్డ్’ (House of the Disappeared). మామూలుగా థ్రిల్లర్ సినిమాల్లో తరువాత ఏం జరుగుతుంది అని ప్రేక్షకులు గెస్ చేస్తుంటారు. కానీ కొన్ని సినిమాల్లో వారు ఊహించినది అస్సలు జరగదు. అలాంటి మూవీస్‌లో ఒకటి ‘హౌజ్ ఆఫ్ ది డిసప్పియర్డ్’. ఈ చిత్రం ప్రీ క్లైమాక్స్ చేరుకునేవరకు అసలు ఇది టైమ్ ట్రావెల్‌కు సంబంధించింది అని ఎవరూ గెస్ చేయలేరు. అలా అనుక్షణం ట్విస్టులతో సాగే కథ ఇది.
కథ..
‘హౌజ్ ఆఫ్ ది డిసప్పియర్డ్’ కథ విషయానికొస్తే.. 1992లో కథ మొదలవుతుంది. మి హూ (యుంజిన్ కిమ్) అనే మహిళ దెబ్బలతో ఇంటి బేస్మెంట్‌లో పడుంటుంది. లేచి చూసి తన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతలోనే తనను ఏదో శక్తి బేస్మెంట్‌లోకి లాకెళ్లిపోతుంది. తన భర్తను చంపినందుకు, తన కొడుకు కనిపించకుండా పోయినందుకు మి హూను అదుపులోకి తీసుకుంటారు పోలీసులు. పాతికేళ్ల తర్వాత తనకు గొంతు క్యాన్సర్ రావడంతో పోలీసులు తనను జైలు నుంచి విడుదల చేస్తారు. అదే ఇంట్లో ఉంచి మి హూకు సెక్యూరిటీగా ఉంటారు. అదే సమయంలో తనను కలవడానికి పర్మిషన్ తీసుకోని ఒక ఫాదర్ వస్తాడు. అప్పుడే అసలు పాతికేళ్ల క్రితం ఏం జరిగింది అని తనకు చెప్తుంది మి హూ.
మి హూకు ఇద్దరు కొడుకులు. మొదటి భర్త క్యాన్సర్‌తో చనిపోవడంతో మరొకరిని పెళ్లి చేసుకొని తనతో కూడా ఒక బిడ్డకు జన్మనిస్తుంది. తన రెండో భర్త కూడా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తనను దూరం పెడుతుంది. కానీ పిల్లలతో మాత్రం సంతోషంగానే ఉంటుంది. ఒకరోజు తన పెద్ద కొడుకు చేసిన పొరపాటు వల్ల తన చిన్న కొడుకు మరణిస్తాడు. అయినా కూడా మిహూ.. తనను ఏమీ అనదు. కానీ మి హూ భర్త మాత్రం సొంత కొడుకు చనిపోయాడనే కోపంతో మి హూ మొదటి కొడుకును చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ తానే చనిపోతాడు. ఆ తర్వాత తన కొడుకు ఆ బేస్మెంట్ లోపలికి వెళ్లిపోయాడని ఆ ఫాదర్‌తో మొత్తం కథ చెప్తుంది మిహూ. దీంతో అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫాదర్ ప్రయత్నిస్తాడు. ముందుగా అసలు ఆ ఇంటి ఓనర్లు ఎవరు అని తెలుసుకోవడం మొదలుపెడతాడు.
చాలా ఏళ్ల క్రితం వేరే దేశం నుంచి వచ్చిన ఒక జనరల్ ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు. ఆ జనరల్‌తో సహా తన కుటుంబాన్ని ఆ ఇంట్లోనే చంపేశారని ఫాదర్‌కు ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. ఆ ఆర్టికల్ రాసిన రిపోర్టర్‌ను కలవడానికి వెళ్తాడు. అయితే జనరల్ చేసిన అక్రమాలను తట్టుకోలేక రైతులు అతడిని చంపడానికి వెంటబడిన మాట నిజమే. కానీ అదే సమయంలో తన కుటుంబంతో సహా ఆ జనరల్ ఇంటి బేస్మెంట్‌లోకి వెళ్లి దాక్కున్నాడని, ఆ తర్వాత బేస్మెంట్ డోర్ క్లోజ్ అయిపోయిందని రిపోర్డర్ చెప్తాడు. ఆ తర్వాత ఒక తల్లి, ఇద్దరు కూతుళ్ల ఆ ఇంట్లో ఉండడానికి వస్తారు. వారు కూడా అనూహ్యంగా ఒకరోజు మాయమయిపోతారు. దీన్ని బట్టి చూస్తే ప్రతీ పాతికేళ్లకు ఒకసారి ఆ ఇంట్లో ఉన్నవారు మాయమయిపోతున్నారని ఫాదర్‌కు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఇంటి బేస్మెంట్‌లో ఏముంది? అనేది తెరపై చూడాల్సిన కథ.
వెంటవెంటనే ట్విస్టులు..
‘హౌజ్ ఆఫ్ ది డిసప్పియర్డ్’ అనేది టైమ్ ట్రావెల్ సినిమా అని తెలియడమే ఇందులో అతిపెద్ద ట్విస్ట్. అసలు ఆ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. ఒక్కసారి ఇది టైమ్ ట్రావెల్ అని రివీల్ అయిన తర్వాత వెంటవెంటనే ప్రేక్షకులు ఊహించని మరెన్నో ట్విస్టులు వస్తుంటాయి. ట్రైమ్ ట్రావెల్‌కు సంబంధించిన కథ కాబట్టి ఆడియన్స్ పలు చోట్ల కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి థ్రిల్లర్ ప్లస్ టైమ్ ట్రావెల్ కథను చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ‘హౌజ్ ఆఫ్ ది డిసప్పియర్డ్’ను చూసేయండి.