National Film Awards 2023: ‘జై భీమ్‘కు అవార్డు రాకపోవడంపై హర్ట్- నాని ఇన్ స్టా పోస్టు వైరల్!
దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ‘జై భీమ్’ సినిమాకు ఒక్క జాతీయ అవార్డు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేచురల్ స్టార్ నాని కూడా ఈ విషయంపై స్పందించారు.
2021 ఏడాదికి గానూ చలనచిత్ర జాతీయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డులను జ్యూరీ సభ్యులు గురువారం (ఆగస్టు 24) ఢిల్లీలో వెల్లడించారు. ఈసారి తెలుగు చిత్రాలు ఏకంగా 10 అవార్డులను దక్కించుకున్నాయి. 69 ఏండ్లలో తొలిసారి తెలుగు హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపిక అయ్యారు. అయితే, దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న కొన్ని చిత్రాలకు జాతీయ అవార్డులు రాకపోవడంపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.
‘జై భీమ్’కు అవార్డు రాకపోవడంపై నాని అసంతృప్తి
అవార్డులు పొందే అర్హత ఉన్నా, ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా దక్కని చిత్రం ‘జై భీమ్’. తమిళంలో TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన తెరకెక్కిన ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే, ఈ సినిమాను జ్యూరీ గుర్తించకపోవడంపై చాలా మంది బాధపడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాని కూడా ‘జై భీమ్’ సినిమాకు అవార్డు రాకపోవడంపై స్పందించారు. తన అసంతృప్తిని, ఆవేదనను ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. ఇన్ స్టా స్టోరీలో ‘జై భీమ్’ అని రాసి ఓ హార్ట్ బ్రేక్ సింబల్ ను పోస్టు చేశారు. ఎలాంటి కామెంట్స్ చేయకుండా తన మనసులోని బాధను ఒక మాట, ఒక బొమ్మతో చెప్పేశారు. సూర్య చిత్రానికి అవార్డు రాకపోవడం తన హృదయాన్ని ముక్కలు చేసింది అనే అర్థం వచ్చేలా ఈ పోస్టును షేర్ చేశారు. గతంలో చాలా సార్లు ‘జై భీమ్’ సినిమా గురించి నాని ప్రస్తావించారు. తనకు నచ్చిన సినిమాకు ఒక్క విభాగంలోనూ అవార్డు రాకపోవటంతో నాని బాధపడ్డట్లు తెలుస్తోంది.
తమిళ కేటగిరీలో ఏ సినిమాకు అవార్డు వచ్చిందంటే?
తమిళంలో 'జై భీమ్'కు జాతీయ అవార్డు వస్తుందనుకున్నా మిస్ అయ్యింది. ఉత్తమ తమిళ చిత్రం కేటగిరీలో మణికందన్ తెరకెక్కించిన ‘కడైసి వివాహాయి’ సినిమాకి అవార్డు దక్కింది. ఒక గ్రామంలోని చివరి రైతుకు సంబంధించిన కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. విజయ్ సేతుపతి, యోగి బాబు, సప్తవర్ణ మాయాండీ ప్రధానపాత్రల్లో నటించారు.
'జై భీమ్' గురించి..
ప్రముఖ న్యాయవాది చంద్రు జీవితం ఆధారంగా ‘జై భీమ్’ సినిమానూ తెరకెక్కించారు. న్యాయవాది చంద్రు పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య కనిపించారు. తమిళంలో రూపొందిన ఈ మూవీ, ఆ తర్వాత తెలుగుతో పలు భాషల్లో విడుదలైంది. 2021లో కరోనా ఉండటంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. సూర్య నటన అందరినీ ఆకట్టుకుంది. ఇతర పాత్రలు కూడా అందరినీ కంటతడి పెట్టించాయి. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డులు వస్తాయని అందరూ భావించారు. అయితే, ఈ చిత్రానికి ఒక్కటంటే ఒక్క విభాగంలోనూ అవార్డు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Read Also: బన్నీకి బెస్ట్ యాక్టర్ అవార్డు- ఆ బాలీవుడ్ నటుడికి అస్సలు మింగుడు పడటం లేదా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial