Suresh Babu - Oscars: రాజమౌళితో ముందే చెప్పా, 'ఆస్కార్' వచ్చాక చేద్దాం అన్నారు: నిర్మాత సురేష్ బాబు
సినిమా ఇండస్ట్రీకు చెందిన పలువురు ప్రముఖులు రాజమౌళి అండ్ టీమ్ ను కొనియాడుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఆస్కార్ 2023 అవార్డుల వేడుకలో ఇండియన్ సినిమా తన సత్తా చాటింది. అందరూ అనుకున్నట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో ఎన్నో ఏళ్లుగా భారతీయులంతా ఎదురుచూసున్న కల నిజం అయింది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో ఇటు తెలుగుతో పాటు యావత్ భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. సినిమా ఇండస్ట్రీకు చెందిన పలువురు ప్రముఖులు రాజమౌళి అండ్ టీమ్ ను కొనియాడుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది కేవలం తెలుగువారి విజయం కాదని యావత్ భారత్ సాధించిన విజయమని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత సినిమా రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ అని భాషాభేదాలతో విడగొట్టకూడదని అంతా కలసి ఇండియన్ సినిమాగా ఉండాలని చెప్పారు. ఇది భారత సినిమా భవిష్యత్ కు సంబంధించినదని అన్నారు. ఈ పాటను ఈ స్థాయిలో తీర్చిదిద్దిన రాజమౌళి అండ్ టీమ్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఓ పక్క ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మంచి కమర్షియల్ సినిమాకు ఆస్కార్ రావడం మరోపక్క ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ ఫిల్మ్ డాక్యుమెంటరీకి బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ జాబితాలో ఆస్కార్ రావడం శుభపరిణామం అని అన్నారు. ఆ డాక్యుమెంటరీని తీసిన దర్శకురాలు కార్తీక్ గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా లకు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానన్నారు.
అలాగే ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘నాటు నాటు’ లైవ్ ప్రదర్శనను వేదికపై ప్రకటించింది కూడా భారతీయ నటి దీపికా పదుకోణ్. ఆమె కూడా ఈ పాట గురించి చాలా బాగా చెప్పిందని అన్నారు. క్రమేపి మనమంతా కలసి ఇండియన్ సినిమాగా మారే సమయం వస్తోందన్నారు. ఒకప్పుడు ఒక భాషలో నటీనటులు ఇంకో భాషలో తెలిసేవారు కాదు. కానీ, ఇప్పుడు భాషాభేదాలు లేకుండా సినిమాల్లో నటిస్తున్నారు, ప్రేక్షకులు కూడా అలాగే చూస్తున్నారని అన్నారు. ఇప్పుడు భారతీయ సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
ఈ ఆస్కార్ అవార్డు వచ్చిన శుభ సందర్భాన్ని సంబరంలా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు సురేష్ బాబు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచన తనకు ఉందన్నారు. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినపుడే తాను రాజమౌళితో ఓ ఈవెంట్ ప్లాన్ చేద్దామని చెప్పానని, ఆయన ‘ఆస్కార్’ కూడా వచ్చాక ప్లాన్ చేద్దాం అన్నారని చెప్పారు. అనుకున్నట్టే ఇప్పుడు ‘ఆస్కార్’ అవార్డు కూడా వచ్చిందని అన్నారు. త్వరలోనే ఇండస్ట్రీ అంతా కలసి ఒక పెద్ద కార్యక్రమం చేస్తామాని అన్నారు సురేష్ బాబు.
Read Also: ఒక ఎన్టీఆర్, ఒక చిరు, ఒక రాజమౌళి - టాలీవుడ్‌కు నడక నేర్పారు, ఉనికి చాటారు, ఎల్లలు దాటించారు!