Pawan Kalyan - Krishna : కృష్ణకు పవన్ నివాళి - 'వీర మల్లు' షూట్ క్యాన్సిల్
Mahesh Babu Father Death : కృష్ణ మృతికి సంతాపంగా, ఆయన గౌరవార్థం 'హరి హర వీర మల్లు' షూటింగును పవన్ కళ్యాణ్ క్యాన్సిల్ చేసినట్టు తెలిసింది. ఇంకా చాలా మంది తమ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేశారు.
కృష్ణను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయనకు నటశేఖరుడు అనే బిరుదు ఉంది. ఇంకా ఆయనను బోలెడు పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు వరించాయి. అయితే... ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ఆయన ఎప్పుడూ సూపర్ స్టారే. కృష్ణ అంటే అందరికీ, పరిశ్రమకు ముందుగా గుర్తు వచ్చేది సూపర్ స్టార్. అటువంటి స్టార్ హీరో మరణం పరిశ్రమకు తీరని లోటు. తెలుగు చిత్రసీమకు ఎంతో సేవ చేసిన కృష్ణ గౌరవార్థం బుధవారం తెలుగు సినిమా షూటింగులు బంద్ చేశారు. పవన్ కళ్యాణ్ అయితే మంగళవారం షూటింగ్ క్యాన్సిల్ చేశారని టాక్.
'వీర మల్లు' షూటింగ్ చేయవద్దన్న పవన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతోన్న చారిత్రాత్మక చిత్రం 'హరి హర వీర మల్లు' (Hari Hara Veera Mallu). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. పవర్ స్టార్ ఇప్పటం వెళ్ళడానికి ముందు, వెళ్లి వచ్చిన తర్వాత షూటింగులో జాయిన్ అయ్యారు.
కృష్ణ మృతి చెందిన విషయం తెలియగానే దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) కు ఫోన్ చేసి షూటింగ్ క్యాన్సిల్ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. బుధవారం షూటింగ్ చేశారట. కృష్ణ పార్థీవ దేహానికి మంగళవారం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. నానక్ రామ్ గూడలోని విజయ నిర్మల నివాసానికి వెళ్లి మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను కలిసి వచ్చారు.
మంగళవారం షోలు రద్దు!
కృష్ణ (Krishna Death) మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో మంగళవారం కొన్ని సినిమా ప్రదర్శనలు రద్దు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం పూట ఆటలు రద్దు చేసినట్టు పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ & ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ పేర్కొంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హనుమాన్' టీజర్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అలాగే, లేటెస్ట్ తమిళ హిట్ 'లవ్ టుడే' తెలుగు వెర్షన్ ట్రైలర్ మంగళవారం విడుదల చేయాలనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా దిల్ రాజు క్యాన్సిల్ చేశారు.
Also Read : కృష్ణకు కడసారి వీడ్కోలు - తీవ్ర భావోద్వేగానికి గురైన మహేష్ బాబు, అభిమానులు కన్నీళ్లు
పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' (Pawan Kalyan's HHVM) విషయానికి వస్తే...ఆ సినిమాలో మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటించనున్నట్లు తెలిసింది. నిధీ అగర్వాల్ (Nidhi Agarwal) కథానాయికగా, బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి (Nargis Fakhri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.