Padma Vibhushan Awards: చిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరోలు ఎవరో తెలుసా?
Padma Vibhushan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. ఆయనకు ముందు ఈ అవార్డు అందుకున్న సినిమా ప్రముఖులు ఎవరో చూడండి.

మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. చిరు కంటే ముందు పద్మ విభూషణ్ పురస్కారం చిత్ర పరిశ్రమకు ఎవరెవరికి వచ్చింది? సినిమా ఇండస్ట్రీలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు ఎందరు ఉన్నారు? అందులో హీరోలు ఎవరు ఉన్నారు? ఒక్కసారి చూడండి.
హీరోల్లో తొలి పద్మ విభూషణ్ అక్కినేని
పద్మ విభూషణ్ అందుకున్న తొలి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఈ గౌరవం ఆయనను 2011లో వరించింది. ఆ తర్వాత ఈ పురస్కారం అందుకున్న కథానాయకులు అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్. ఈ హిందీ హీరోలు ఇద్దరికీ 2015లో వచ్చింది. ఆ మరుసటి ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పద్మ విభూషణ్ అందుకున్నారు.
తెలుగునాట అక్కినేని తర్వాత పద్మ విభూషణ్ అందుకున్న హీరో చిరంజీవి. ఇటు 20వ దశాబ్దం తర్వాత... అంతకు ముందు దశాబ్దాల్లో ప్రేక్షకులను, ఆబాలగోపాలాన్ని అలరిస్తున్న కథానాయకుడు ఆయన. ఆయన్ను 2004లో అప్పటి భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఇప్పుడు చిరు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఈ ఏడాది నటి వైజయంతిమాలను సైతం పద్మ విభూషణ్ వరించింది.
గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి... చిత్రసీమలో తొలి!
భారతీయ చిత్రసీమలో తొలి పద్మ విభూషణ్ అందుకున్న ఘనత గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సొంతం. అంతే కాదు... రామన్ మెగసెసే పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీతకారిణి కూడా! భారతరత్న (1998లో) అందుకున్న తొలి భారతీయ సంగీత కళాకారిణి కూడా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి. ఆమెను 1975లో ఈ పురస్కారం వరించింది.
దర్శకుడు సత్యజిత్ రాయ్ 1976లో పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత 1992లో ఆయనను భారతరత్న పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. సితారిస్ట్ రవిశంకర్ 1981లో పద్మ విభూషణ్, 1999లో భారతరత్న అందుకున్నారు. శాస్త్రీయ నృత్య దర్శకుడు, కమల్ హాసన్ 'విశ్వరూపం'లో ఓ పాటకు నృత్య రీతులు సమకూర్చిన బిర్జూ మహారాజ్ 1986లో పద్మ విభూషణ్ అందుకున్నారు.
Also Read: మాటలు రావడం లేదు.. పద్మవిభూషణ్‌పై ఎమోషనలైన చిరంజీవి
గాయకుడు ఎం బాలమురళీకృష్ణను 1991లో, మరాఠీ & హిందీ చిత్రాల దర్శకుడు వి శాంతారాంను 1992లో, గాయకులు లతా మంగేష్కర్, డీకే పట్టమ్మాళ్, భీంసేన్ జోషిలను 1999లో పద్మ విభూషణ్ వరించింది. లతాజీని 2001లో, జోషిని 2009లో భారతరత్న పురస్కారం వరించింది. లతా మంగేష్కర్ చెల్లెలు ఆశా భోంస్లేకు 2008లో ఈ గౌరవం దక్కింది.
ఇంకా ఈ 20వ దశాబ్దంలో చిత్రసీమకు చెందిన ప్రముఖుల్లో పద్మ విభూషణ్ అందుకున్నది ఎవరని చూస్తే... సంగీత దర్శకుడు ఇళయరాజా (2018లో), గాయకుడు కేజే ఏసుదాసు (2017లో), హృషికేష్ ముఖర్జీ (2001లో), ఆడూర్ గోపాల కృష్ణన్ (2006లో), నృత్య దర్శకుడు జోహ్రా ముంతాజ్ సెహగల్ (2010లో), గాయకుడు భూపేన్ హజారికా (2012లో) ఉన్నారు. గాన గంధర్వుడు ఎస్పీబీని 2021లో వరించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

