Kota Srinivasa Rao : షియాజీ షిండేపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు.. నటన రానివాళ్లకోసం తెలుగువారిని పక్కన పెట్టేస్తున్నారంటూ ఆవేదన
తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు నటీనటులకు అవకాశాలు దక్కట్లేదన్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. పరభాష నటీనటులను అందలం ఎక్కిస్తున్నారని విమర్శించారు.
Kota Srinivasa Rao About Tollywood Actors: ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ తెలుగు నటీనటులతో కళకళలాడిందని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. రాను రాను పరభాష నటీనటుల ప్రభావం పెరిగిందన్నారు. టాలీవుడ్ లో తెలుగు వారికే అవకాశం దక్కడం లేదన్నారు. సినిమాలో పాత్రకు తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుంటే కథ వెయిట్ పెరుగుతుందన్నారు. ఈ రోజుల్లో సినిమాలు సర్కస్ మాదిరిగా కనిపిస్తున్నాయని కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన పేరు చెప్పగానే సినిమా చేయన్నాను- కోట శ్రీనివాసరావు
గొప్ప నటీనటుల దగ్గర నౌకరు పాత్ర చేసేందుకు కూడా తాను సిద్ధమని కోట శ్రీనివాసరావు చెప్పారు. కానీ, పరభాష నుంచి తీసుకొచ్చిన నటన రాని వాళ్లను గొప్ప పాత్రలు చేయిస్తూ, వారి ముందు ఇక్కడి వారిని సాధారణ పాత్రలు చేయిస్తే చేయబుద్ది కాదన్నారు. “తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత మంది తెలుగు వాళ్లు ఉన్నారు చెప్పండి. ఇతర భాషల వాళ్లను పెట్టుకోకూడదని కాదు. వాళ్ల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ నటించే వాళ్లు తెలుగులో ఉన్నారు. మంచి వాళ్లను పట్టుకోండి. అమ్రిష్ పురి, నజీరుద్దీన్ షా, అమితాబ్ బచ్చన్, నానా పాటేకర్ లాంటి వాళ్లు తీసుకోండి తప్పులేదు. వాళ్లు చాలా చక్కగా నటిస్తారు. అలాంటి వాళ్ల దగ్గర నా లాంటి వాళ్లు నౌకరు వేషం వేయమన్నా వేస్తారు. కానీ, నటనా వృత్తిగా పెట్టుకున్నాం. డబ్బులు ఇస్తున్నారు. నటిస్తున్నాం. అంతే, అనే ఆలోచన ఈ రోజుల్లో చాలా మందికి ఉంది.
షియాజీ షిండేతో ఓ సినిమాలో యముడి వేషం వేయించారు. ఆయన నటిస్తున్నట్లు నాకు తెలియదు. నా దగ్గర ఓ 10, 15 రోజులు డేట్స్ తీసుకున్నాడు నిర్మాత. మరికొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవుతుందనే సమయంలో ఏదో చెప్పడానికి నా దగ్గరికి వచ్చాడు. మాటల మధ్యలో యముడి పాత్ర గురించి మాట్లాడారు. నేను సత్యనారాయణ గారు వేస్తున్నారు అనుకున్నాను. చివరకు చలపతిరావు గారు అన్నా వేస్తారు అనుకున్నాను. యముడి పాత్ర ఎవరు వేస్తున్నారు? అని అడిగాను. షియాజీ షిండే అన్నారు. వెంటనే ఆయనకు ఇచ్చిన డేట్స్ కాగితం చించేశాను. ఆయనకు కోపం వచ్చింది. ఎందుకు చించేశారు? అన్నారు. ఆయన యముడి వేషం వేస్తే, నేను ఆయన ముందు సాధారణ వేషం వేస్తే జనాలు తిడతారు అన్నాను. శ్రీనివాసరావుకు సిగ్గులేదా? అంటారు. యముడు అంటే ఆ స్థాయి వ్యక్తి చేస్తేనే బాగుంటుంది అన్నాను. ఆయన ఏ రకంగా సూట్ అవుతారు? అన్నాను. మనిషిని చూడగానే బాగున్నాడు అనేలా ఉండాలి. ఈ రోజుల్లో యాక్టింగ్ లేదు. సినిమాల్లో ఉన్నదంతా సర్కసే” అని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
ఎన్నో భాషల్లో చక్కటి పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు
నటుడు కోట శ్రీనివాసరావు పలు భాషల్లో అద్భుత పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు. ఐదు భాషల్లో సూపర్, డూపర్ హిట్ సినిమాలు చేశారు.తెలంగాణ యాసను సైతం అద్భుతంగా పలికించే సత్తా ఉన్న నటుడు కోట శ్రీనివాస రావు.
Read Also: నిన్న అన్న, నేను తమ్ముడు- సిక్స్ ప్యాక్‌తో అలరించబోతున్న ఆనంద్ దేవరకొండ!