KL Rahul Wedding: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న కేఎల్ రాహుల్, అతియా శెట్టి - ముంబైలో పూర్తయిన వేడుక!
కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం ముంబైలో సింపుల్‌గా జరిగింది.
KL Rahul Athiya Shetty Wedding: భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం చేసుకున్నారు. వీరి ఇద్దరూ చాలా కాలం నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ముంబైలో ఇద్దరూ చాలా సింపుల్‌గా కొద్ది మంది సన్నిహితుల మధ్య ఏడు అడుగులు వేశారు. కేఎల్ రాహుల్, అతియా వివాహానికి చాలా సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే కొన్ని రోజుల తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఉండనుంది. దీనికి దాదాపు మూడు వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది.
మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, మెంటర్ గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్‌లు... కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహానికి హాజరయ్యారు. అదే సమయంలో న్యూజిలాండ్ సిరీస్ కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి క్రికెటర్లు వివాహానికి హాజరు కాలేదు.
వివాహం తర్వాత కేఎల్ రాహుల్, అతియా శెట్టి హనీమూన్‌కు వెళ్లే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం ఇద్దరి షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంది. అలాంటి పరిస్థితిలో వివాహం తర్వాత ఇద్దరూ తమ తమ పనిలో బిజీగా ఉంటారు.
వేదిక వెలుపల అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి, అన్నయ్య అహన్ శెట్టి ఫొటోగ్రాఫర్ల కోసం పోజులిచ్చారు. సునీల్ శెట్టి స్టీల్ గ్రే షేర్వానీలో మెరిసిపోతుండగా, అహన్ శెట్టి క్రీమ్ కలర్ షేర్వాణిలో తలపై తిలకంతో కనిపించారు. వీరిద్దరి స్టైలింగ్ అదుర్స్ అనిపించేలా ఉంది.
అతియా శెట్టి బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ ష్రాఫ్ లొకేషన్‌కి రావడం కనిపించింది. ఇంతకుముందు కృష్ణ ష్రాఫ్ ఈ పెళ్లికి రెడీ అవుతున్న ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కృష్ణ ష్రాఫ్‌తో పాటు క్రికెటర్ ఇషాంత్ శర్మ, అన్షులా కపూర్ వంటి వారు వేదిక వద్దకు చేరుకున్నారు.
ఇక కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఫాంలో లేడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించలేకపోయాడు. పిచ్‌పై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను నిరంతరం కష్టపడ్డాడు. తన పేలవ ప్రదర్శనతో రాహుల్ విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు రాహుల్ దూరమయ్యే అవకాశం ఉందని జాఫర్ చెప్పాడు.
బంగ్లాదేశ్‌లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల హోమ్ టెస్ట్ సిరీస్‌కు రాహుల్ తుదిజట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ 22, 23, 10 మరియు 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముఖ్యంగా ఈ భారత ఓపెనర్ 2022లో నాలుగు టెస్టుల్లో 17.13 సగటుతో 137 పరుగులు మాత్రమే చేశాడు.
వసీం జాఫర్ అభిప్రాయం ప్రకారం కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ వస్తే కేఎల్ తప్పుకోవాల్సి ఉంటుంది. 145 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కష్టపడటంపై కూడా జాఫర్ స్పందించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించేందుకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అనుమతించారన్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్‌ల డిఫెండింగ్ వ్యూహాన్ని కూడా ప్రశ్నించాడు.