K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు
కె. విశ్వనాథ్ మరణంతో చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ఈ బాధను తట్టుకునే శక్తి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
K Viswanath Is No More : తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో దర్శక దిగ్గజాన్ని కోల్పోయింది. లెజెండరీ ఫిల్మ్ మేకర్, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ (K Viswanath) గురువారం రాత్రి కన్ను మూశారు. ఆయన మరణంతో భారతీయ చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఒక్కసారిగా షాక్ తిన్నది. విశ్వనాథునితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు ఈ బాధను తట్టుకునే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. నివాళులు అర్పిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు - చిరంజీవి
విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ''నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు. ఆయన కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈ రోజు ఆయన కన్నుమూసిన వార్త విని షాక్ కు గురి అయ్యాను. ఆయన లాంటి దర్శకుడు కన్ను మూయటం నాకే కాదు... తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అని సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
ఆయనది ఉన్నతమైన స్థానం - ఎన్టీఆర్
''తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. 'శంకరాభరణం', 'సాగర సంగమం' లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలను మనకు అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ... ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Also Read : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
దిగ్భ్రాంతికి గురయ్యాను - మమ్ముట్టి
''శ్రీ కె. విశ్వనాథ్ గారి మరణ వార్త విని నేను తీవ్ర దిగ్బ్రాంతికి గురి అయ్యాను. ఆయన దర్శకత్వంలో 'స్వాతి కిరణం' చేయడం నాకు లభించిన అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను'' అని మమ్ముట్టి ట్వీట్ చేశారు. విశ్వనాథ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
'ఆత్మ గౌరవం'తో దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్, ఆ తర్వాత సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో నటించారు. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. 'శంకరాభరణం', 'స్వాతి ముత్యం', 'సిరిసిరిమువ్వ', 'సప్తపది', 'స్వర్ణ కమలం', 'సాగర సంగమం', 'శృతి లయలు', 'సిరివెన్నెల', 'స్వయం కృషి' వంటి ఉన్నతమైన చిత్రాలను ఆయన అందించారు.
విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విశ్వనాథ్ కూడా అందులో ఉద్యోగానికి వెళ్లారు. సౌండ్ రికార్డిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. మన సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన 'పాతాళ భైరవి' చిత్రానికి ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు.