Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!
కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. 18 ఏండ్ల క్రితం ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల కాగా, రజనీ మూవీ హిట్ అయ్యింది.
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమలహాసన్ మంచి మిత్రులు. ఇద్దరూ తమిళ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తొలినాళ్లలో వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లోనూ నటించారు. స్టార్స్ గా ఎదిగిన తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. మళ్లీ ఇద్దరు కలిసి నటించే అవకాశమైతే రాలేదు. వారిద్దరినీ మళ్లీ ఒకే మూవీ చూడాలని అభిమానులు ఇప్పటికీ ఆశపడుతున్నారు. అయితే, వారిద్దరూ కలిసి నటించే అవకాశం వస్తుందో లేదోగానీ.. ఇద్దరు సినిమాలు ఒకే రోజు విడుదలై ఇరువురి అభిమానుల్లో చిచ్చుపెట్టే రోజైతే వచ్చేస్తోంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. దీంతో కమల్, రజినీ అభిమానుల మధ్య ఇప్పటికే పోటీ మొదలైపోయింది.
చివరి దశకు చేరిన ‘ఇండియన్-2’ షూటింగ్
తాజాగా ‘విక్రమ్’ సినిమాతో కమల్ హాసన్ సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఆ సక్సెస్ జోష్ లో ఉన్న కమల్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 1996లో శంకర్-కమల్ కాంబోలో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ గా ‘ఇండియన్-2’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పాత విజిలెంట్‌గా కనిపిస్తాడు. సేనాపతి పాత్రను ఇందులోనూ కంటిన్యూ చేస్తాడు. సెట్స్ లో ప్రమాదం జరిగిన తర్వాత చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా షూట్ గతేడాది తిరిగి ప్రారంభమైంది. దాదాపు 26 ఏళ్ల తర్వాత రెండో భాగం విడుదల కానుంది.
#Indian2 from today.
— Kamal Haasan (@ikamalhaasan) September 22, 2022
@Udhaystalin @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/TsI4LR6caE
జైపూర్ లో ‘జైలర్’ షూటింగ్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘జైలర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాప్, యోగిబాబు సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జైపూర్ లో కొనసాగుతోంది. జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
Muthuvel Pandian arrives at 12.12.22 - 6 PM😎
— Sun Pictures (@sunpictures) December 11, 2022
Wishing Superstar @rajinikanth a very Happy Birthday!@Nelsondilpkumar @anirudhofficial #Jailer#SuperstarRajinikanth #HBDSuperstar #HBDSuperstarRajinikanth pic.twitter.com/ocF0I7ZPEi
18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్
కాగా, ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలకు రెడీ అవుతున్నాయి. సుమారు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి సినిమాలు ఒకేరోజు పోటీ పడుతున్నాయి. 2005 ఏప్రిల్ 14న రజనీకాంత్ ‘చంద్రముఖి’, కమలహాసన్ ‘ముంబయి ఎక్స్‌ప్రెస్’ చిత్రాలు ఒకేరోజు విడుదలయ్యాయి. అప్పట్లో రజనీ ‘చంద్రముఖి’ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. మళ్లీ 18 ఏళ్ల తరువాత రజనీకాంత్ ‘జైలర్’ చిత్రం, కమలహాసన్ ‘ఇండియన్–2’ ఒకే రోజు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎవరి సినిమా హిట్ అందుకుంటుందోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాల విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also: అది నాకు కలిసి రాలేదు, ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లయ్యింది - సాయి ధరమ్ తేజ్ కామెంట్స్