NC 24 Update: నాగ చైతన్యతో ఢీ కొట్టబోతున్న బాలీవుడ్ నటుడు... NC 24 విలన్ గా 'లాపతా లేడీస్' స్టార్
NC 24 Update : నాగ చైతన్య నెక్స్ట్ మూవీ కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ గా రంగంలోకి దిగబోతున్నారనే బజ్ నెలకొంది ఇండస్ట్రీలో. ఆయన ఇప్పటికే 'లాపతా లేడీస్' మూవీతో పాపులర్ కావడం విశేషం.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'తండేల్' మూవీ రిలీజ్ సిద్ధమవుతున్న తరుణంలో, ఆయన నెక్స్ట్ మూవీ గురించి వస్తున్న వార్తలు మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగచైతన్య చేయబోతున్న సినిమాలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ గా చేయబోతున్నాడు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
నాగ చైతన్య కోసం బాలీవుడ్ విలన్
నాగచైతన్య 38వ పుట్టినరోజు సందర్భంగా ఆయన 24వ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని 'ఎన్సీ24' అనే వర్కింగ్ టైటిల్ తో స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. నాగచైతన్య పర్వతారోహణ చేస్తున్నట్టు, ఓ గుహలో ఉన్నట్టు ఆసక్తిని రేకెత్తించే విధంగా ఆ పోస్టర్ ను క్రియేట్ చేశారు. ఈ అడ్వెంచర్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీకి 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఈ సినిమాలో నటించబోయే నటీనటులు వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. కానీ నాగచైతన్య సరసన ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్ పోషించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాలో విలన్ కూడా సెలెక్ట్ అయ్యాడు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అ రూమర్స్ ప్రకారం 'లాపతా లేడీస్' సినిమాతో పాపులర్ అయిన యంగ్ యాక్టర్ స్పర్ష్ శ్రీవాత్సవ ఈ సినిమాలో నాగ చైతన్యతో ఢీ కొట్టబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే శ్రీవాత్సవను మెయిన్ విలన్ గా సెలెక్ట్ చేసిన మేకర్స్, త్వరలోనే లుక్ టెస్ట్ కూడా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. అలాగే ఈ మూవీకి 'వృషకర్మ' అనే టైటిల్ ను మేకర్స్ అనుకుంటునట్టు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం 'ఎన్సీ24' మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Also Read: 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... రామ్ చరణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?
'తండేల్' తరువాత బ్రేక్
ప్రస్తుతం నాగచైతన్య 'తండేల్' ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'తండేల్' మూవీని ఫిబ్రవరి 7న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మూవీ రిలీజ్ కి పెద్దగా టైం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 'బుజ్జి తల్లి' సాంగ్ సంచలనం సృష్టించగా, రీసెంట్ గా రిలీజ్ అయిన 'శివశక్తి' అనే రెండో పాట కూడా దాదాపు 7 మిలియన్లకు పైగా వ్యూస్ ను కొల్లగొట్టింది. అలాగే రెండ్రోజుల క్రితం నాగచైతన్య చేపల పులుసు వండిన వీడియోను రిలీజ్ చేసి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ మూవీ తరువాత చిన్న బ్రేక్ తీసుకుని, నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయనున్నారు చై.
Also Read: చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రియాంక చోప్రా - రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు ఎందుకు థాంక్స్ చెప్పిందంటే?





















