'దిల్' రాజు చెప్పినా వినలేదు
ఇండస్ట్రీలో 'దిల్' రాజు జడ్జ్‌మెంట్‌కు తిరుగు ఉండదు. ఆయన చెప్పిన మాట చాలా మంది వింటుంటారు. కానీ, ఓ యువ నిర్మాత ఆయన మాట వినలేదు.
'దిల్' రాజు (Dil Raju) ది 50 సినిమాలు నిర్మించిన అనుభవం. ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న నిర్మాతల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. సినిమా తీశాక నలుగురికి చూపించి సలహాలు తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన సలహా కోరే, పాటించే నిర్మాతలు చాలా మంది ఉంటారు. అయితే, 'మసూద' చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka) మాత్రం 'దిల్' రాజు మాట వినలేదు. ఆయన సలహా పక్కన పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా 'దిల్' రాజు చెప్పారు.
రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన లేటెస్ట్ సినిమా 'మసూద' (Masooda Movie) శుక్రవారం విడుదల అయ్యింది. పాజిటివ్ మౌత్ టాక్, రివ్యూస్‌తో రోజు రోజుకూ సినిమా కలెక్షన్స్‌లో పెరుగుదల కనబడుతోంది. 'మసూద' విషయంలో వినిపించిన విమర్శల్లో నిడివి ఎక్కువ అయ్యిందనేది ఒకటి. రివ్యూ రైటర్లకు మాత్రమే కాదు, 'దిల్' రాజు ఫీలింగ్ కూడా అదే. ఈ సినిమాను విడుదల చేసింది ఆయనే.
రెండు గంటల నలభై ఐదు నిమిషాల 'మసూద'లో కొంత కట్ చేయమని రాహుల్ యాదవ్ నక్కాకు చెబితే... 'కుదరదు' అనే సమాధానం వచ్చిందని 'దిల్' రాజు చెప్పారు. తాను అయితే సినిమాలో పదిహేను నిమిషాలు కట్ చేయించే వాడినని చెప్పారు. సినిమా విడుదలకు ముందు చూసిన వాళ్ళలో నిడివి విషయంలో కొందరు కనెక్ట్ కాలేదని... అయినా సరే రాహుల్ ధైర్యంగా, నమ్మకంతో విడుదల చేశాడని, అతడిలో గట్స్ ఉన్నాయని 'దిల్' రాజు అన్నారు. అతడి నమ్మకమే విజయం సాధించి పెట్టిందని చెప్పారు. 'మసూద' సక్సెస్ మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బు కోసం కాకుండా మంచి సినిమాకు మద్దతు ఇస్తే కొంత మందికి అయినా రీచ్ అవుతుందనేది తన నమ్మకం అని ఆయన చెప్పారు.
''నిజాయతీగా ఉండాలనుకున్నా. కమర్షియల్‌గా చేయడానికి స్క్రిఫ్ట్ పరంగా 'మసూద'లో చాలా అవకాశాలున్నాయి. కథ విన్నాక అందులో సోల్ పోకూడదని అనుకున్నాను. హారర్ అంశాలతో పాటు ఎవరికైనా సహాయం చేయడానికి కారణం అవసరం లేదనే సందేశం నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకొన్నాను. అందుకే కమర్షియల్‌గా కాకుండా వైవిధ్యంగా ఉండాలని, నిజాయతీగా వెళ్ళాను. నిడివి గురించి ఆలోచించలేదు. జెన్యూన్ హారర్ డ్రామా కావడంతో అలాగే తీశా'' అని రాహుల్ యాదవ్ నక్కా చెప్పారు. సౌండ్ డిజైన్‌తో థియేటర్లలో చూడాల్సిన సినిమా 'మసూద' అని ఆయన అన్నారు. ఓటీటీకి సినిమా అమ్మలేదని ఆయన చెప్పారు. హీరో లేదని వాళ్ళు ఆఫర్ చేసిన అమౌంట్ నచ్చకపోవడంతో రిజక్ట్ చేశానన్నారు.
Also Read : 'మసూద' రివ్యూ : భయపెట్టడం కోసమే తీసిన సినిమా - భయపెట్టిందా? లేదా?
తనకు హారర్ సినిమాలు అంటే భయమని, చూడనని... కానీ, 'మసూద' విషయంలో చాలా హ్యాపీగా ఫీలవుతున్నాని నటి సంగీత చెప్పారు. ప్రేక్షకులు అందరూ థియేటర్లలో సినిమా చూడాలని ఆమె కోరారు. దర్శకుడు వెంకటేష్ మహా, నటుడు ప్రియదర్శి సినిమా తమకు నచ్చిందని చెప్పారు.
తిరువీర్ (Thiruveer), కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) జంటగా... సంగీత, బాంధవి శ్రీధర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. నగేష్ బనెల్ సినిమాటోగ్రఫీ అందించారు. వాళ్ళిద్దరి వర్క్ ప్రశంసలు అందుకుంటోంది.